Revision 31032 of "నా రాముడు/అయోధ్యారాముఁడు (నా రాముడు)" on tewikisourceఅయోధ్యారాముఁడు శా. నీరేజాక్షుఁడు రాజుబిడ్డడయి జన్మించెన మహాధర్మ ధా రా రాజ్యంబుగ రామరాజ్యమను పేర్గల్గంగ పాలించు నం చేరో తారు ఋషుల్ వచింపఁగను లోనెంతేని విశ్వాసమై కోరన్ వేలకువేల యేండ్లు నెదురైకూర్చున్న యా భూప్రజల్. ఎవరో ఋషులు వేలయేండ్లుగా చెప్పుచునే వచ్చిరి. ఏమని ? నీరేజాక్షుఁడు-విష్ణువు. దశరథుని కడుపునఁ బుట్టును. రాజ్యము చేయుట యనఁగా నెట్లో ఆయనకే తెలియును. ఆయనయే చేయును. దానికి రామరాజ్యమని పేరు వచ్చును. ఆ రాముని పుట్టుక కొఱకు అయోధ్యా ప్రజలు వేలయేండ్లు కూర్చుండిరి. రాజునకు నలుగురు కొడుకులు పుట్టుదురని సుమంత్రునికిఁ దెలియును గదా? అట్లే కొందఱు ఋషులకును తెలియును. వారు చెప్పుచుందురు. ఇది యీ దేశములో జరిగెడు కథ. ఇట్లు జరుగు నిట్లు జరుగునని ఋషులు చెప్పుచుండిరి. అట్లే జరుగుచుండెను. ఇది సృష్టికి వ్యాఖ్యానము. గీ. పుత్రకామేష్టి చేసెను భూమిపతియు వెసఁ బ్రజాపతి యుదయించి యొసఁగినాఁడు పాయసమ్మును పుట్టెను బ్రభు వయోధ్యఁ గలుగు ప్రజలకు ధరకాలు నిలువదాయె. ఈ పద్యములో నివి చెప్పుట ప్రజలయొక్క యెదురు చూచుటలోని యతిశయమును చెప్పుట. ఒక సంగతి జరిగిన తరువాత మఱియొక సంగతి జరుగుచున్నది. చివరకు ప్రభువు పుట్టినాడు. ప్రజలకు కాలు నిలుచుట లేదు. ప్రతీక్ష ఫలించినట్లున్నది. శా. ఆ బాలుం గనుగొంచుఁ గొంచు, నొక బ్రహ్మానందమై కోటకున్ రాఁబోఁగాఁ బదివేల్ మిషల్ గొలుపుచున్ రాముంగనుం గొంచు నెం తే బంటుల్ బతిమాలగాఁ గనుచు నాయిండ్లన్ శరీరమ్ములున్ ధీ బాంధుర్యము కోటలో శిశువునన్ దీపించు భాగ్యంబుగన్. ఆ పిల్లవాని నదే చూచుట. కొద్దిరోజులు పోగా పిల్లవాఁడు కోటలో నుండును. ప్రజలకు గోటలోనికిఁ బ్రవేశములేదు. వేయి మిషలువెట్టి కోటలోనికిఁ బోవుట. స్వామిని చూచుచుండుట. ఆ కోటలోనుండి జపము కదలరు. బంటు లదలించుటకు వీలులేదు. శిశువైన రామునిచూచుట యెట్టిదో బంటులకును తెలియును. ఆ యానందమును ప్రజలు పొందుచున్నారు. వారిని పొండు పొండని కేకలు వేయుటయెట్లు? అందుచేత సేవకులు వారిని వెళ్ళుడని బతిమాలుచున్నారు. ప్రజలు వెళ్ళినారు వారియిండ్లలో వారి శరీరములు, వారి ధీ బాంధుర్యముబుద్ధియొక్క చక్కఁదనము కోటలోనున్న శిశువు నందున్నది. ఇదియా ప్రజల భాగ్యము. ఎంతో తపస్సు చేసినవారికి సైతము నిలువదే! వారి బుద్ధి నిత్యము ప్రభువునందే యున్నది. ఏమి యదృష్టము. కం. స్వామి కనిపించకుండఁగ నాముని యొక్కండు వచ్చెనది మేలేయై స్వామి తిరిగి యింటికిరా భూమీసుతఁ దెచ్చె నొక్కబొమ్మ వధువునాన్. బిడ్డ పెరిగినాఁడు. చిన్నప్పటి ప్రేమ చూపించు లక్షణము వేఱు. బిడ్డ పెరిగిన తరువాత చూపించెడి లక్షణము వేఱు. బిడ్డ యెక్కడికో వెళ్ళును. మరల వచ్చును. ఈ లోపుగా ప్రాణము లలమటించవు. తిరిగి వచ్చునన్న ధైర్యము గుండెలో స్థాయి నేర్పఱుచుకొనును! విశ్వామిత్రుఁడు వచ్చినాఁడు. స్వామిని తీసికొని వెళ్ళినాఁడు. ప్రజలకు స్వామి మఱల వచ్చునుకదా యన్న ధైర్యము. స్వామి వచ్చినాఁడు. ఊరకే రాలేదు. ఒక బొమ్మను తెచ్చినాఁడు. ఆమె సీత. ఆ బొమ్మ యనుటలో ప్రజలకు సీతను చూడగా నెంతముద్దో చెప్పుటయైనది. అంతయు బాగుగా నున్నది. స్వామి పెరుగుచున్నాఁడు. సీతతో కాపురము చేయుచున్నాఁడు. దినమున కెప్పుడో యొకప్పుడు కనిపించుచున్నాఁడు. ఇంక స్వామి రాజు కావలయును. గీ. చిట్టచివరకు రేపభిషేకమంచు వినఁబడియెఁ దెల్లవారులు కునుకులేదు పిట్ట పిడుగైన వార్తయై పట్టణంబు ప్రాణములతోడి శవముల పాయకారి. రేపభిషేకము. ఆ ప్రజలకు తెల్లవారులు నిదురలేదు. తెల్లవారినది. దుర్వార్త వచ్చినది. జనులందఱు శవములే! కాని, బ్రదికి యున్నారు. పాయకారి యనఁగా భూమి తనది కాదు. వాఁడు పొలము దున్నురైతు. అట్టివాఁడు పాయకారి. దున్నక తప్పదు. భూమి తనది కాదు స్వాతంత్ర్యము లేదు. భూమిలో భాగములేదు. రాముఁడు రాజైనచో రాజ్యము తమది. తమ పొలమును తాము దున్నుకొందురు. రాముఁ డడవికిపోగా నీ లక్షణము చెడిపోయినది. శా. ఊరెల్లన్ రఘు రామువెంట గమనోద్యోగంబు సాగింపఁగా శ్రీరాముండనె మీకు నాపయినినా ! ప్రేమంబు నాదేహమం దారాముండను నేన నాదయిన దేహంబా శరీరంబెయా నో రేపోమఱికాదు రేపటికి రేపోవచ్చుఁ గాదౌ నిటన్ ప్రజలు అయోధ్యను పాడువెట్టి రాముని వెంటపోగా బయలుదేరిరి. ఇక్కడ నున్నది సోగసు. ఆ రాముఁడెవ్వఁడు, ప్రజలెవ్వరు? రాముని యందు ప్రేమ యెట్టిది, యెందుకు ? వట్టి రాజైనచో నంత ప్రేమ యెందులకు ? వారి ప్రేమ రాజులందు ప్రజలకుండెడు ప్రేమను దాటిపోయినది. వట్టి ప్రజలైనచో రాముఁడీ చెప్పఁబోయెడి మాటలు చెప్పెడివాఁడు కాఁడు. వారందఱు మహాభక్తులు. వారికి తత్త్వోపదేశము చేయవలయును. అప్పుడు వారికి యథార్థజ్ఞానము కలుగును. ఆ ప్రజల యదృష్టమది. పరమేశ్వరుడైన రామచంద్రుని దయ యిది. రాముఁడనుచున్నాఁడు ''ఓయీ! నీ ప్రేమ నా మీఁదనా నా శరీరము మీఁదనా? రాముఁడను నేనా ? నా యీ దేహమా ? దేహమేయైనచో రేపోకాదో రేపటికి రేపో అనగా యెల్లుండియో మృత్యువు వచ్చును. కాదు, ఇక్కడ నౌనా ? దేహమిచ్చట నుండునా? గీ. కడచె బాల్యమ్ము రాజునుగాను నేను ఆగు డింకొక బాల్యమైనన్ని నాళ్లు మరలివత్తును మీకునై మహివహింతు ఆఁగి వేలేండ్లు నీ కొంచె మాగలేరె ? నా బాల్యములో నేను రాజును కానుగదా ఈ వనవాసము పదునాలుగేండ్లే కదా ! మఱి యింకొక బాల్యమన్నమాట. నేను తిరిగి వత్తును. మీ కోసము రాజ్యము చేయుదును. రాముఁడు రావణ సంహారము కొఱ కవతార మెత్తెను. తరువాత రాజ్యము చేయుట తప్పదు కనుక చేసెను. చేసెను గనుక ధర్మము నిలబెట్టెను. అతని తండ్రులును ధర్మమును నిలబెట్టినవారే. ఈయన విశేషముగా నిలబెట్టెను. రాముఁడు రాజ్యము చేయుట ఱ కవతారమెత్తలేదు. అవతారమెత్తుట వేరే పనికోసము. ఎత్తినాఁడు కనుక నీ పనిచేయుచున్నాఁడు. తిరిగి వత్తును. మీ కోసము ధాత్రి నేలుదు నన్నాఁడు. తిరిగి వచ్చిన తరువాత మఱల తానే రాజగునా ? భరతుని దుఃఖము పాదుకా వృత్తాంతము సర్వము నీ మాటలలో నున్నవి రాముఁడు పరమేశ్వరుఁడు గనుక నాయన కన్నియుఁ దెలియును నేను రాజగుటకు వేల యేండ్లాగినారు. పదునాలు గేండ్లాగలేరా? స్వామి ప్రజలకు నింతకుముందు శరీరము లనిత్యములు ఆత్మనిత్యమని చెప్పినాఁడు. ఇప్పుడాజ్ఞానముకలుగుటకు శాంతిక్షమలయొక్క యవసరమునుచెప్పుచున్నాఁడు. శా. అన్నా ! ఆ అటవిన్ మృగాలకును మీరన్నంబొ మీకున్‌మృగా లన్నంబో తొలిదైన నేఁదిరిగిరానౌటేల మీర్ధ్యాన సం పన్నుల్ రాజయి వత్తు తత్త్వగుణ సంపన్నంబు సాకేతమిం దున్నేఁజేసెద రామరాజ్యమును నేతున్ మీరు నన్విన్నచో రాముఁడు చెప్పుచున్నాఁడు. అడవిలో మిమ్ము మృగాలు తినునో, మీరు మృగాలను తిందురో, అక్కడ మీ రడవిలోని మృగాలను చంపి తినవలయును. వేఱ యాహారము లేదు. అడవి నిర్జంతువగును. అడవులు నిర్జంతువులు కారాదు. కాక మీరంద ఱడవిమృగాల కాహారమైనచో నేను తిరిగి వచ్చుట యెందులకు? వచ్చి యెవరిని పాలింపవలయును ? మీరు ధ్యాన సంపన్నులు కండు. నన్నే ధ్యానము చేయుచుండుడు. నేను పదునాలుగేండ్లు తరువాత తిరిగి వత్తును. అప్పుడు నేను రాజు నగుదును. మీకు ఆత్మయొక్క నిత్యత్వము శాంతిక్షమలు ధ్యానమును బోధించితిని. ఆ ప్రకారము మీరు చేసినచో మీరు సత్త్వగుణ సంపన్నులగుదురు. అయినచో నేను రామరాజ్యమును నిర్మింతును. ప్రజలు దుష్టులైనచో రామరాజ్యమెట్లు సాధ్యమగును? మీరు సజ్జనులు కండు. నాది రామరాజ్యమగును. మీరు నన్ను విన్నచో నా మాటలు విన్నచో నేను రామరాజ్యమును నిర్మించుటకు నేతున్- నేర్తును. నేర్తున్ అన్న క్రియారూపమునకు నేతున్ అన్న రూపము కూడ కలదు. ప్రజలందఱు సత్త్వగుణ సంపన్నులైనచో రామరాజ్యము నెవఁడైనఁజేయవచ్చు ననవచ్చును. అప్పుడే రామరాజ్యము సాధ్యము. ప్రజలు సత్పురుషులగుట వేఱు. రామరాజ్యము చేయుట వేఱు. మ. ఇహలోకంబును బారలౌకికము రెండేచున్ సమర్థంబుగా ద్వ్యహ జాతంబగు చిన్నియాపద అయోధ్యాపట్టణంబెల్ల స న్నహనంబందిన నింత చాపము ప్రతిజ్ఞాసిద్ధి యేమౌను నన్ దహరాకాశమునందు నిల్పుఁడి యయోధ్యారాముఁడే నౌటకున్. రాముఁడింకను జెప్పుచున్నాఁడు. నేను చెప్పినట్లు మీరు చేసినచో మీ కైహికాముష్మికములు రెండును సిద్ధించును. ఇది చిన్న ఆపద. ద్వ్యహ జాతము-ద్వి+అహ-రెండు రోజులు మాత్రముండునని యర్థము. ఈ మాత్రమునకు మీ రందఱు నావెంట వచ్చినచో సన్నహనము పొందినచో- సన్నహనమనగా సన్నాహము. సన్నాహమనగా యుద్ధమునకుఁ బయలుదేరుట. ఇంతయూరు బయలుదేరిన యుద్ధమునకుఁ బోయినట్లుండును గదాయని యర్థము. అప్పుడు నా ధనుస్సెందుకు ? నా ప్రతిజ్ఞ యెందుకు ? అనగా నా ధనుస్సుతో నెప్పుడును మిమ్ముల రక్షించుచునే యుండవలయును. మీరందఱు నావెంట వచ్చినచో నేనడవికి వెళ్లినట్లగునా? మీరు నన్ను దహరాకాశము నందు నిల్పుడు. హృదయమునందు నిల్పుఁడు అప్పుడు నేనయోధ్యారాముఁడ నగుదును. అయోధ్యారాముఁ డనగా నర్థమిది. అయోధ్యయందలి సర్వప్రజల హృదయము లందును రాముఁ డున్నాఁడని యర్థము. అప్పు డయోధ్యకు రాముఁడు రాజు. రాజనఁగా నిట్లుండవలయును. మా. అనినన్ భూ ప్రజ మేమయోధ్యయు నయోధ్యారాముఁడీవౌదు కా ని నిజంబారయ నీ యయోధ్యయు శ్మశానీభూతమౌసుమ్ము మే మును సన్యాసులమౌదు మప్పటికి మేమున్ మంచి సంసారులై తనరన్ నీవునువచ్చి ¸°దువ యయోధ్యారాముఁడంచాడుచున్ అప్పుడు ప్రజలిట్లు సమాధానము చెప్పిరి. మే మయోధ్యయై యిచ్చట నుందుము. నీ వయోధ్యారాముఁడవై యడవిలో నుందువు. నిజానికి మేమయోధ్యకాము. మేమందఱము సన్యాసులము. అయోధ్య శ్మశానము. ఇంతే. నీవు తిరిగి రావలెను. అప్పుడు నీ కొఱకు మేము సంసారులమగుదుము. మా కొఱకు నీ వయోధ్యారాముఁడ వగుదువు. నీవు రాజగుట యొకలీల. మేము ప్రజలమగుట యొకలీల. సిద్ధులైన జీవులను భగవంతుడు పాలించినట్లు. భూ ప్రజలను రాజు పాలించినట్లు కాదు. రామరాజ్యమనగా నిదియే. అట్లాడుచు ప్రజలు వెళ్ళిపోయిరి. వెళ్ళిపోయిరని మనము కలుపుకొన వలయును. All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?oldid=31032.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|