Revision 31035 of "నా రాముడు/జానకీ రాముఁడు (నా రాముడు)" on tewikisourceజానకీ రాముఁడు ఉ. ఆయమపుట్టెఁ బాల్కడలి నంగనగాఁ దనవంతు తీసికోన్ ఈయమధాత్రిలోన జనియించెను విల్లును వంపఁ బెండ్లమై ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము తానెయామెయై ఆయమకంటియానఁబడి యాచరణం బఖిలంబు చేయుచున్. లక్ష్మి పాలసముద్రములో పుట్టినది. దేవదానవలు సముద్రమును మధించిరి. విష్ణువు కూర్మావతారమై మంథర పర్వతమును పెకెత్తెను. సముద్ర మథనమునఁ దానుకూడ సహాయపడెనుగదా? ఎవరివంతు వారు తీసికొనుచుండిరి. విష్ణువు లక్ష్మీదేవిని తనవంతుగా తీసికొనెను. ఇది పూర్వపుకథ. ఇప్పుడీయమ అనగా సీత భూమిలో పుట్టెను. ధనుస్సు వంచినాఁడు కనుక పెండ్లమయినది. ఈ సీత పూర్వవేదములయొక్క తత్త్వము. ఈ భగవంతుడు వేదములయందున్నాఁడు. సీత వేదతత్త్వము. స్వామి వేదతత్త్వము తానె. యామెయైనాఁడు. ఇప్పుడా లక్ష్మికి నీసీతకు భేదమున్నది. ఆ లక్ష్మీతనకు భార్యయైనది. తానుభర్త. ఆమె తనచేత భరింపఁబడునది. ఈ సీతయో, లోకదృష్టిచేత భార్యయైనను ఆమెయే తాను, తానే యామె. లక్ష్మియనగా స్వామి చెప్పినట్లు చేయవలయును. భార్య కదా! భర్తయనగా భరించువాఁడు. స్వామియందు కొంత ఆలక్షణమున్నది. సీత విషయములో నట్లుకాదే. సీతయొక్కకంటి యాజ్ఞతో తానే సర్వమును చేయవలయును. ఇది భేదము. అందుకనియే పెండ్లికాకముందే మారీచుని సముద్రములో త్రోసినది. ఆమె పనికోసమే. ఉ. #9; తానెవనిన్‌దలంచదును దండ్రిగ, నేర్పడినట్టి బిడ్డయై తానవనిన్ వరించినది తల్లిగ నేర్పడినట్టి బిడ్డకై కోనరయన్ విదేహపతి గుఱ్ఱపు జన్నపు దుక్కియందునన్ జానకియయ్యె సీతయయి సర్వమహస్సుమపేటి కాకృతిన్. తాను తనతండ్రి యెవరని చెప్పును? జనకుఁడా? తాను భూమిదున్నగా నందులో కనిపించిని బిడ్డయాయెను. ఆమెకుఁదండ్రిలేఁడు.ఊరకే జనకరాజు కూఁతురు, పెంచినాఁడు కనుక పెడ్లి చేసినాడు కనుక. తాను తండ్రిగా జనక రాజును వరించలేదు. వరించినచో తనకు దుఃఖము వచ్చినప్పుడు తండ్రి యొద్దకు పోవును. పోలేదు. తాను అవనిన్ - భూమిని తల్లిగా వరించెను. తాను వరించుటయే! ఆ భూమి యామెను కనలేదు. తానొక యేర్పడిన బిడ్డ. యజ్ఞధాత్రి దున్నుచో, తానుకన్పించినది. జనకునకు కనిపించినది కనుక జానకి. నిజముగా తానెవరు? సీత. సీతయనగా నాగేటిచాలు. సర్వమైన మహః-తేజస్సులనెడి పుష్పముల యొక్క పేటికాపెట్టెయొక్క, ఆకృతిన్-ఆకారముతో, అనగా సీత యొక పెట్టెలో దొరకినది ఆపెట్టెలో నున్నది. సీతసర్వము పుష్పమయాకృతి యన్నమాట. సుమము-మహస్సుమ అని యున్నదిగద! సుమశబ్దము సూః అన్న ధాతువునుండి పుట్టినదని చెప్పవలయును. సర్వజీవకోటిని సృష్టించునది అని యర్థము. సాక్షాత్తు పరాశక్తియని యర్థము. ఉ. ముగ్గురు వూరుషుల్ మఱియు ముగ్గురు స్త్రీలయినట్టి వెల్గునా ముగ్గురు స్త్రీలు వేఱ మఱిముగ్గురు నింకను నెందఱోధరన్ మగ్గిన యట్లుగా నగుచు క్ష్మాసకలంబును తామె¸°చునా ముగ్గురునైన పూరుషులు మోయఁగ సర్వము కార్యభారమున్. ఇప్పుడు సీత పరాశక్తియని చెప్పినాము. ఆ శక్తియేమి చేసినది? ముగ్గురు పురుషులను సృష్టించినది తానేమైనది? ముగ్గురు స్త్రీలయినది. అంతటితో సరిపోలేదు. పురుషుల విషయములో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురును చాలుదురు. ప్రధానముగా విష్ణువు చాలును. స్త్రీల విషయములో లక్ష్మి పార్వతి సరస్వతి' ముగ్గురు చాలరు. ఎందుకనగా వీరు స్త్రీలు. అధికారము పురుషుల చేతులలో పెట్టిరి. ఆందుచేత పరాశక్తి తాననంతరూపములను పొందినది. పురుషులచేత మోయించుచున్నది. సీత. ద్రౌపది, రేణుక ఇంక నెంతమందియో శక్తులు. గీ. శక్తిలేదయేని సాగదు లోకమ్ము శక్తికొలఁది జగము సాగుచుండు సర్వశక్తి కలుగు స్వామి శ్రీరాముండు సర్వశక్తి యిచట జనకదుహిత. శక్తి వలన సృష్టి సాగుచున్నది. స్త్రీగర్భవతి కావలయును. సృష్టి జరుగవలయును పురుషుఁడు బీజనిక్షేపము మాత్రమ చేయును. ఆ బీజనిక్షేపము శక్తియున్నచో చేయును. సర్వశక్తియు శ్రీరామునందున్నది. ఆయనస్థితి కారకుఁడు గనుక. స్థితిరక్షకుఁడు గనక. ఇచ్చట సీతయే సర్వశక్తి. ఏయే కార్యము లాచరించుటకు రాముఁడవతరించెనో ఆయాసర్వకార్యములు రాముని చేత చేయించునది సీతగనుక అందుకనియే వాల్మీకి రామాయణమును సీతాయాః చరితమ్ మహత్ అనినాఁడు. శంకర భగవత్పాదులు 'శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్'' అన్నారు సీత మహాశక్తి. చం. అనుగుణమైన శక్తియును నద్భుతదైవము పోహళింపుగా జనునుధరిత్రి యీ ధర పొసంగ నొకానొకచోట మించి వ చ్చినఁదొటివెల్గు శక్తియును శ్రీపతి చేయిని చేసికోవలెన్ పని కలిగించుచున్ తమకుపట్టని యట్లుగ దక్కునల్వురున్. ధరిత్రి అనగా యీ భూమి సృష్టి జనుల బ్రదుకులు, యిచ్చట జరిగెడి మహాకార్యములు నివన్నియు ధరిత్రి. ఈ ధరిత్రి యెట్లు జరుగుననగా ఒక అద్భుతమైన దైవమునకు అనుగుణమైన శక్తితో పోహళింపు జరిగినచో జరుగును. పోహళింపు అన్న శబ్దము తెలుఁగులో విలక్షణమైన శబ్దము. ముత్యమును గ్రుచ్చుట పోహలించుట యందురు. ముత్యములు సరములో మెడ దగ్గఱి సన్నగా నుండి గుండెదగ్గఱకు లావగును. అన్నియు నిజానికి సన్నములే. ఆ సన్నవలలో కంటికి తెలియరానంత భేదము ఆ కంటియొక్క నేర్పు కల్గిన వారే ముత్యములను పోహళింపఁగల్గుదురు. ఇదియొక పరమ సూక్ష్మదర్శినియైన విద్య, దైవమును శక్తియు సమకూరుట కూడ నొక పోహళింపుగా నుండును. ఎచ్చట నెంతదైవ ముండును? అచ్చట నెంట శక్తి కావలయును? అంతయుఁ బరమేశ్వర నిర్దిష్టమైనను మానవుని వివేకమునకు సంబంధము లేకపోలేదు. ఈ సంబంధము వలననే లోకము పొసగుచున్నది. సుఖముగా సాగుచున్నది. కాని యొక చోట మించివచ్చును. ఈ పొసగుదల చెడిపోవునన్నమాట. కొందఱు తమ శక్తి చాల గొప్పదని దైవమును మించి నడతురు. కొందఱు సర్వము దైవాధీనమని వలసిని పౌరుషము ప్రయోగించరు. వలసిన పౌరుషము ప్రయోగించపోయినచో వ్యవహారము చెడిపోవును. చెడిపోయినచో చెడిపోనిమ్ము అనుట వైరాగ్య మనుకొందురు. కావచ్చును. కాకపోవచ్చును. కొందఱు దైవమును లెక్కచేయక సర్వము తమశక్తికే ఆధీనమై యుండునని తలఁతురు. మానవుని శక్తి వేఱు సృష్టియందు కావలసిన దైవముతో కూడిన శక్తివేఱు. తనశక్తియే సర్వాధిక మనుకొనుట మించివచ్చుట. అట్టి సమయములో తొలి వెలుఁగైన మహాశక్తి దుర్గకానీ, విష్ణుమూర్తి కానీ తాము గల్పించుకొనవలయును. వారు చేయి చేసికొన వలయును. వీరు ముగ్గురు జంటలు కదా! విష్ణుమూర్తియు పరమేశ్వరియైన దుర్గాదేవియుఁగాకుండ నల్వురున్నారు. లక్ష్మీ సరస్వతులు, శివ బ్రహ్మలు. వీరు నల్వురు ఈ విష్ణువునకు నశక్తికి పరి కల్పించుచుందురు. బ్రహ్మయు శివుఁడును కొందఱకు వరాలిచ్చి ఆ రాక్షసులనో దుర్జనులనో సృష్టిని సాగనీయనట్లు చేయువారినిగా సిద్ధపరుతురు. మరల నీ లక్ష్మీసరస్వతులంతే. లక్ష్మి ఒక దుర్జనుని దగ్గఱ పీట పెట్టుకొని కూర్చుండును వాఁడు లోకమును సాఫీగా సాగనీయండు. సరస్వతియు నట్లే. ఒక విపరీత బుద్ధి దగ్గఱ ఒక యల్పిష్ఠబుద్ధి దగ్గఱ కూర్చుండును వాఁడు వేదములను కాదనును. స్మృతి పురాణములను కాదమను. అప్పుడు విష్ణువైన శ్రీపతియు మహాశక్తియైన దుర్గయు తమచేయి చేసికోవలసి వచ్చును. చం. మనసున నెన్ననొక్కహరి మాత్రమె జోక్యముఁబెట్టుకొన్నటుల్ కనఁబడు లక్ష్మితోడుగను శక్తికిఁజిహ్నముగాఁగ. నేటి క బ్బినదగు నాపదన్ దొలఁచ వేదగతార్థము శక్తి¸°చుఁ బొ ల్చిన తొలిశక్తివచ్చినది చేసెడుస్వామికిఁదప్ప దెప్పుడున్ మించివచ్చిన పనులను విష్ణుమూర్తియే చక్కఁ బఱుచుచుండును. బ్రహ్మయు శివుఁడును కల్పించుకోరు. మువ్వురు పురుషులలో లోకసంగ్రహణము విష్ణుమూర్తి కెట్లో మువ్వురు స్త్రీలలో దుర్గాదేవి కట్లు. ఆ దుర్గయో పార్వతియో శక్తియో శివుని భార్య. విష్ణు వెన్ని యవతారములెత్తినను ఆ శక్తి లక్షణములు కలిగిన లక్ష్మిని తోడు తెచ్చికొనును. లక్ష్మిచేయునది యేమియులేదు. ----------------------------------------------------------------------------------------- 1. దుప్పలేదు. ధాత్రిని నడిపించు టీతఁడు వహించిన కార్యము సర్వకర్తయై. ఆవిడ వట్టి సాక్షిణి. ఈ రామాయణమునందట్లు కాదు. ఇచ్చటికి వచ్చినది జానకి. ఈమె లక్ష్మీసరస్వతులవంటిది కాదు. ఎక్కువ భాగము పార్వతి వంటిది. శక్తివంటిది. ఎందుకనగా నామె వేదములలో తత్త్వము కనుక. ఈ శక్తికాని తక్కిన దేవతలుగాని యెవరు? వేదములోని తత్త్వస్వరూపులు వేదమెందుకు పుట్టినది? అవిదితమైన బ్రహ్మపదార్థము సృష్టి కభిముఖమైన బ్రహ్మపదార్థము విదితముగాఁజేయుటకు పుట్టినది. ఆ శక్తి యొక్క ప్రథమావతారము వేదార్థము. వేదముయొక్క తత్త్వము. వేదాంతముల లోని సర్వశక్తి. ఇప్పుడు రామావతార మేమగుచున్నది? అటు విష్ణుమూర్తి, యిటు శక్తి, ఇద్దఱును కలిసి జన్మించవలసిన యవతారమగుచున్నది. ఎందుచేత? వీరిద్దఱును కలిసినఁగాని రావణ సంహారము జరుగదు. ఆ రావణుఁడంతటి వాఁడు. అతఁడు పరవ శివభక్తుఁడు. శాక్తేయుఁడు. సర్వవేదార్థ పరిజ్ఞాత. అంతవానిని వధించుట సులభము కాదు. అందుచేత నిద్దఱును కలిసివచ్చిరి. అతఁడు శాక్తేయుఁడు. వేదార్థ పరిజ్ఞాత, శక్తియొక్కయు వేదతత్త్వము యొక్కయు సాహాయ్యము రామునకు కలిగి తీరవలయును. ఇది సూక్ష్మమైన మర్మము. ఈ వేదము యొక్క తత్త్వమేమి చేయుచున్నది? రాముని నడిపించుచున్నది రావణుఁడా శాక్తేయుఁడు, వేద పండితుఁడు. వానియందభిమాన మా శక్తికున్నది. వేద తత్త్వమున కున్నది. రాముఁడూరకేపోయి చంపుటకు రావణుఁడితర రాక్షసుల వంటివాఁడు కాఁడు. చివరకు రాముఁడైనను రావణుని నెట్లుచంపెను? సర్వ సృష్టి మూలహేతువగు బ్రహ్మాస్త్రముతో చంపెను. తక్కిన బ్రహ్మాస్త్రములు పనికి రాలేదు. వేదతత్త్వ మెటువంటిది? ఆ బ్రహ్మాస్త్రము వంటిది. ఇది యంతయు నొకతత్త్వము. ఇంకనెంతో చెప్పవలయును. ఇక్కడికి వదలి పెట్టుదము. మ. తనశక్తిత్వమునుం బ్రధానముగ సంధానంబుఁ గావించుచోఁ దనహేతుత్వము వేదమందెసఁగు వేదంబుల్ రహస్యబు మూ ర్తినిగొన్నట్టిది ధర్మమున్ నిలుప వైదేహీనవాకార, రా ముని మారీచుని దువ్వునందెగచు నంపున్ జోదనత్వంబుగా. ఈ శక్తితన ప్రధాన లక్షణమును సంధానము చేయవలయును. ఈ సర్వసృష్టికి తాను హేతువు, ఈ ఆహేతుత్వము వేదములయందున్నది. కనుక తాను వైదేహి యైనది. వైదేహీ సవాకార. మహాశక్తి యిదియొక క్రొత్త యాకారమును తాల్చినది. వేదంబుల్ రహస్యంబు-వేదంబుల రహస్యంబని యర్థము. తెలుఁగులో నిట్లుకూడనుండును. ఈ వైదేహి ఆవేదరహస్యము మూర్తి కొన్నట్టిది. ధర్మమును నిలుపగా వైదేహి యైనది రాముఁడు రావణుని సంహరించును. సంహరింపఁడు. సంహరించినచోఁదన యిష్టము వచ్చినట్లు సంహరించును. ఇప్పుడు శక్తి కిష్టమైనట్లు సంహరింపవలయును. ఎందుకనగా. వాఁడు శాక్తేయుఁడై తనకు ద్రోహము చేసినాఁడు కనుక. అందుచేత రాముఁడు చిన్నవాఁడుగ నుండగనే తరువాత మాయలేడి యగుటకు మారీచుని అమ్మవారు రామునిచేత దూరాన సముద్రములో త్రోయించినది. రామకథలో శక్తియొక్క లక్షణమిచ్చటినుండి మొదలు పెట్టినది. రావణ వధకు. కారణము ప్రధానముగా రాముఁడడవికిఁబోవుట మొదటిది. ఈ పనియెవరిచేత జరిగించినది? మంథర చేత, కైకేయిచేత. వాదిద్దఱు స్త్రీలు కావున శక్తి చిహ్నములు. రెండవది రావణుఁడు సీతనెత్తికొని పోవలయును. దానికి ప్రధానకారణ మెవరిచేత కల్పించినది? శూర్పణఖచేత, ఆమెయు స్త్రీ గనుక శక్తి చిహ్నము. ఇంక సీత యెన్ని చేసినది? అందురనియే 'సీతయా? చరితం మహత్' అనినాఁడు. ఉ. రాముఁడె లంకరావలయు రావణు నేమయినన్ వధింపనౌ రాముఁడె విష్ణువంచు మదిరావణుఁ డెంతయు నేర్వగావలెన్ రాముఁడె యీ జగత్తునకు రక్షకుఁడన్నది సర్వేవేత్తృతా శ్రీమహానీయ సత్యమయి చెల్లవలెన్ త్రిగుణమ్ములందునన్ ఒకసారి సీత రావణునితో నన్నది. 'నేను నిన్ను శపించను, రాముని యనుమతి లేదుగనుక'. అనగా సీత శపించఁగలదు. ఆమె శపించినచో రావణుఁడు బూడిదయగును. హనుమంతుఁడు సీతను బుజాలమీఁద నెక్కించుకొని కిష్కింధకు తీసికొనపోయెదననెను. ఆమెరానన్నది. హనుమ రావణుని సంహరింతునన్నాఁడు. ఆమె వలదన్నది. అనగా రాముఁడు లంకకు రావలయును. రావణుని వధించవలయును. ఎందుకు? రావణునకు రాముఁడుమహా విష్ణువని తెలియదు. తెలిసిన నతఁడు లెక్కచేయుట లేదు. రావణున కాసంగతి తెలియవలయును. రాముఁడే యీజగత్తునకు రక్షకుఁడు. అదియే అందఱు వేత్తలు తెలిసికొనవలసిన సత్యము. మొట్టమొదటి త్రిగుణ విభాగములో సత్వరజస్తమోగుణ విభాగములో వారు మువ్వురు నీరు మువ్వురుగా నేర్పడిరి. విష్ణువు స్థితికారకుఁడుగా గుణముల పంపకముచేత నిర్ణయింపబడినాఁడు. ఒక వేళ తాత్కాలికముగా నెవఁడో వైకుంఠము మీఁదకి దండెత్తి పోవుట, విష్ణువచ్చటినుండి పాఱిపోవుట జరుగవచ్చును. బ్రహ్మయిచ్చిన వరములచేత శివుని యనుగ్రహముచేత వాఁడట్లు చేయవచ్చును. అది తాత్కాలికము బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ముగ్గురు నొక్కటియే. వారొకరి మాట నొకరు పాలింతురు. బ్రహ్మయిచ్చిన వరములందలి మర్యాదచేత నారాక్షసునకు మహావిష్ణువు కనిపించడు. అది పారిపోవుటయని వాఁడనుకొనును రావణుఁడు తనకు చావులేకుండ బ్రహ్మవద్ద వరములు పొందెను. వాని బుద్ధిని బ్రహ్మకప్పెను. అందుచేత వాడు యక్షరాక్షస కిన్నరాదులవలన తనకు చావు లేకుండ కోరి నరవానరుల నందులో కలపలేదు. ఎందుకు కలపలేదు. బ్రహ్మ వాని బుద్ధిని కప్పివేసెను. అందుచేత విష్ణువు రావణుని కొఱకు నరుఁడై జన్మింపవలసి వచ్చెను. ఈ రహస్యము రావణునకు తెలియదు వానికొక సందేహము, ఒక ఆశ, ఇవి రెండును కలిసియున్నవి. రాముఁడు విష్ణునాకాఁదా? ఇది సందేహము. రాముఁడు విష్ణువైనచో సీత లక్ష్మి. శక్తి యొక్క యంశ ఆ లక్ష్మిని వీఁడు గ్రహించినచో రాముఁడు విష్ణువుకాఁడు. రాముని విష్ణుత్వము పోవును అప్పుడు తాను మహా విష్ణువగును ఇది వాని కోరిక. బ్రహ్మ బ్రహ్మయే. తాను బ్రహ్మయగుటకు వీలులేదు. శివుడు శివుడే. ఆయన మహాదేవుఁడు మిగిలినది విష్ణువు. తానావిష్ణువెందుకు కారాదు? రాముఁడు విష్ణువైనచో సీతలక్ష్మి కదా! ఆ లక్ష్మిని తాను వశము చేసికొన్నచో రాముఁడుగ మిగిలిపోవును. తాను మహా విష్ణువగును. ఈ సంగతి సీతకు, దెలియును. అందుచేత రాముఁడే లంకకు రావలయును. రావణుని వధించవలయును. రాముఁడు మహావిష్ణువని వానికిఁ దెలియవలయును. మహాశక్తియువేదతత్త్వమునైన సీతయొక్క పట్టుదల యిది. చం. ముగురగు పూరుషుల్ సతులు ముగ్గురు, కాదొకవందమంది యీ జగతి నిరంతమున్ నడుపసాగిన రక్షణ చేయుచున్నవే దగమగు సత్యమున్ చెఱుపఁదాఁబగఁబూనిన రాక్షసాధమున్ బగఁగొని హేతువుల్ తనది స్వామిది వేఱుగనైవధింపనౌ త్రిగుణాత్మకమైన సృష్టిత్రిమూర్త్యాత్మక హేతువై నడచుచున్నది. ఇది వేదమునందలి రహస్యము. రావణుఁడు తాను వేదపండితుఁడై శివభక్తుఁడై శాక్తేయుఁడై యీవేదరహస్యమును మార్పగలనను కొన్నాఁడు. ఈ సత్యమును చెఱుపగలననుకొన్నాడు.అట్టివానిని వధించుట గుణత్రయాతీతమైన శక్తి యొక్క వాంఛ. ఆ రావణుని రాముఁడు దేవతల బాధ తొలగించుటకుఁజంపును. ఇద్దఱి హేతువులు వేఱువేఱ. రావణుని రామునిచేత చంపించవలయును. శక్తి తాను చంపగలదు. రావణుఁడు విష్ణువును కాదనుచున్నాఁడు కదా! విష్ణువు యొక్క యవతారమైన రామునిచేత చంపించవలయును. ఈ వ్రతము శక్తిది కాదు. వేదార్థగతమైన మహాదేవిది. వేదతత్త్వాకృతియైన వైదేహిది. వేదధర్మ స్థాపన వా రారుగురిదియు. ఈమె యారుగురిలో లేదు. కాని తాను మహాశక్తి స్వరూపిణి. అందుచేత రామాయణము. ఇవి యన్నియు సూక్ష్మసూక్ష్మములైన రహస్యములు. కథయొక్క నడకను బట్టి కథలో నున్న యంశములను బట్టి గ్రహించదగినవి మాత్రమే. స్థూలముగా నందందున్నవి. దానియొక్క సూక్ష్మములు రామాయణమునందు కథలో, కథచెప్పెడి శిల్పములో, వారివారి మాటలలో వాల్మీకి చాల రహస్యముగ దాచియుంచినాఁడు. కథ వేఱు. దానియందు రమించుట వేఱు. భక్తి వేఱు, సూక్ష్మమైనతత్త్వము నెఱుంగుట వేఱు. ఈ రావణుని శిక్ష చేయకపోయిననేమి? ఉ. ఆమెయి నిత్యమైన యితిహార్థము నిల్పఁగఁదాను, దేవతా ధామము బాముఁదీర్పగను దానును, నెట్టులనైనఁ గానివే రాముఁడు లంకరావలయు, రావణుఁజంపను, జంపి జానకీ రాముఁడు కావలెన్ మఱియు రావణు శిక్షయు శాశ్వతంబుగాన్ ఈ పద్యములోని మొదటి చరణములోని తాను సీత రెండవ చరణములోని తానును- రాముఁడు, ఇతిహార్థము-(ఇతిహ+అర్థము) ఇతిహ అనగా ఐతిహ్యము. ఇది అవ్యయము. ఐతిహ్యమనగా పారంపర్యముగా నుపదేశింపఁబడు నర్థమని భావము. పారంపర్యమనగా సృష్ట్యాదినుండి కల్పాదులనుండి మొదలిదియని తెలియరాని సమయమునండి గుణత్రయ విభాగము జరిగిననాటినుండి ఒకప్పుడు జరిగినదని మనమనుకొందుము. నిత్యముజరుగుచునేయున్నది. దాని లక్షణ మది.మానవుని జ్ఞానములో నున్న విషయములకు నాద్యంతములున్నవి. వీఁడు చూచుచున్న వస్తువులయొక్క యాద్యంతములయొక్క కల్మియను దోషముచేతగప్పఁబడిన వీని బుద్ధి దుష్టమై వట్టిలౌకికమై యల్పమై ఆద్యంతములు లేని బ్రహ్మపదార్థము, భగవంతుఁడు, శక్తి, త్రిగుణములు మొదలైన వానికి కూడ మొదలు చివళ్ళున్నవిని భావించి వెదికి అజ్ఞానముచేత సిద్ధాంతములు చేయును. ఇది పెద్దదోషము మానవుని అల్పబుద్ధిలో నున్నది. ఇతిహ-ఐతిహ్యము-దాని యర్థమును నిలుపగా జానకి, దేవతాధామము స్వర్గము. బాము-భాద. దానిని తీర్చుటకు రాముఁడు దేనికైననేమి? రాముఁడు లంకకు రావలయును. రావణుని చంపవలయును. ఎందుకు? ఒకటి తాను జానకీ రాముఁడగుటకు. జనకుని కూగురు జానకి. ఆయన బ్రహ్మవేత్త. కనుక నిచ్చట రాముఁడు బ్రహ్మపదార్థ జ్ఞానిసహితుఁడని యర్థము. జానకీ రాముఁడనగా నర్థమిది. మఱి రెండవది యీ రావణుని శిక్ష శాశ్వతముగా నుండవలయును. ఎంత శాశ్వతమనగా రావణవధ జరిగి మూఁడు యుగములైనది. మఱల రావణుని వంటి వాఁడు పుట్టలేదు. పుట్టఁడు. తానువైకుంఠాధిపతిని కావలెనని యెవ్వఁడు ననుకొనడు శాశ్వతము-నిత్యము. నిజానికి శాశ్వతికము. అనిన రూపముండవలె. కాని శాశ్వతమన్న శబ్దము సర్వకవులు నుపయోగించుచున్నారు. ఇది ప్రయోగ సాధువు. All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?oldid=31035.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|