Revision 31036 of "నా రాముడు/రఘురాముఁడు (నా రాముడు)" on tewikisourceరఘురాముఁడు ఉ. దేశము కాలమున్ ముదిరి తెచ్చిన యాపదగాఁగనైన నా వేశముపొంది యప్డు తన విష్ణ్వవతారత నెంచి యేచెడున్ దేశము కాలముం దనకుఁదేకువ లోకువగాఁగనైన స ర్వాశలు మాని వట్టి రఘురాముఁడుగాఁ జరియించుచుండెడున్ దేశము కాలము భగవత్స్వరూపములు. కాని, వ్వవహారదశలో భిన్నములు, సంఘటన దశలో వానియందు దైవమున్నాడు. వట్టి దైవముగా నూరకుండినచో నష్టములేదు. అనాదినుండి వేదములు శాస్త్రములు, కర్మలు, ఉపాసనలు నీ దేశకాల పరస్థితులోనున్నబాధలను వ్యక్తికి తగ్గించుటకేర్పడినవి. కొన్ని బాధలు వ్యక్తియొక్క శక్తికి మించిపోవును. రావణుఁడు వ్యక్తియే కాని, యెట్టి వ్యక్తి? ఒక లక్షమంది వ్యక్తులయొక్క కర్మలను స్వల్పసుఖములకు తనచేతిలో పెట్టుకొన్న వ్యక్తి. వాని తపస్సు వాని వరములు వాని శక్తి అట్టివి. అక్కడ మహాపర్వతము, ఇక్కడలోయ, అక్కడ మహాధనవంతుడు, యిక్కడ నాలుగు వ్రేళ్లును లోనికి పోవనివాఁడు, అక్కడ పదిమంది బలము కలవాఁడు, ఇక్కడ ఒక అర్భనాకారి. ఈరీతిగా సృష్టి వ్యత్యస్తమై దేశకాలములు నడుచుచున్నవి. ఇందులో నూటికి తొంబదిపాళ్ళు దైవముచేసినదనవలయును. ఆదైవమునే మన ముపాసించినచో కొంత యెగుళ్ళు దిగుళ్ళు మానును ఇది వేద మతమునకు వెనుకనున్న రహస్యము, ఈ మతముపేరు హిందూ మతముకాదు, సనాతన మతము కాదు, వైదిక మతము కాదు, దీని నిజమైన పేరు ఉపాసనా మతము. వ్యక్తిగతమైన యుపాసన కతీతమైనప్పుడు భగవంతుఁడు తానే యొకరూపమును తాల్చివచ్చును. ఆ యెగుడు దిగుడులు సర్ది తన దారిని తానువెళ్ళును. ఈ భగవంతుఁడన్న వారిలో విష్ణువన్న యాయనకు నీ మార్పులు పట్టినవి. బాధ్యత ఆయనది అందుచే రాముఁడై యవతరించెను. లేనప్పుడు వట్టి రఘురాముఁడు. రఘు వంశమునందు పుట్టిన రాముఁడు. పూర్వరాజులున్నారు. దిలీపుఁడు, అజుఁడు ఇంకెవరో యెవరో! దశరథ రాముఁడనుట యెందులకు? ఎందులకో చెప్పఁబడినది. రఘురాముఁడని కూడ యనుచున్నారు కద. ఇప్పుడది యెందుకో చెప్పఁబడుచున్నది. మ. తనముత్తాత రఘుండు ధీప్రశమితాత్మన్ శాంతకాముండు కో రని లీలన్ మదివేఁడో కోరె తన భార్యన్ వానికిన్ దానమి చ్చెను తానోనిజభార్య నొక్కఁడు హరించెను గొంచుచన్నట్టి వా నిని నిర్మూలము గాఁగ వానికుదురుస్ నేఱా వధంజేసెఁబో ఇది రామునకు రఘు రాజునకు భేదము. ఈ కథలోకము నందున్నది. ఒకప్పుడు రామునకుఁ గోపము వచ్చినదట. నేనింత మహాకార్యమును చేసితిని. రావణ వధ చేసితిని. రామ వంశమనరు. రఘువంశ మందురు అని యనుకొని వసిష్ఠులతో నీ మాల యనెనఁట. వసిష్ఠుఁడు రామునితోఁ జెప్పెనఁట. ఆ రఘు మహారాజు భార్య నెవఁడో ప్రేమించెను. ఆయన తనభార్య నాతని కిచ్చి వేసెను. నీవేమి చేసితివి? నీ భార్య నెవఁడో యెత్తుక పోఁగా వానిని కూకటి వేళ్ళతో పెల్లగించితివి. ఆయన యెట్టివాఁడు. నీవెట్టి వాఁడవు. ఇది రఘు వంశమా, రామ వంశమా? రాముఁడర్థము చేసికొని యూరకుండెను. ఉ. అంతటి శాంతశీలుఁడతడౌట జనుల్ రఘువంశ మందు రీ యింతటి క్రోధి తాను ధరనెవ్వడు చెప్పును రామవంశమం చింతగ నంతగా కలుగనిదఱి భేదమ తాను చూడ లో కాంతకుఁ డాయనోహృదయ మంతయు మెత్తని వెన్నముద్దయై ఆ రఘువు దేశకాలాతీతుడు కామమును జయించిన వాడు. పరమ విరాగి. ఈ రాముఁడోచండ శాసనుఁడు-దైత్యులను సంహరించెడి వాఁడు. ఆయన స్వరూపమే యట్టిది. ఆయన యవతారమే యట్టిది. ఉ. రాముని లోపలన్ ముగురురాములు తోచుచునుంద్రు వేల్పులన్ బాములుపెట్టు రక్కసుని బట్టి వధింపఁగ విష్ణుమూర్తి ¸° రాముఁడు, జానకీ సమయరక్ష వహించెడి వేదమూర్తి ¸° రాముఁడయోధ్యరాజు, రఘురాముఁడు పంక్తిరథాత్మజాతుఁడై రాముఁడు మువ్వురుగా కనిపించును. చరించును. రావణ సంహారము చేసిన రాముఁడు వేఱు, ఆయన విష్ణువుయొక్క అవతారము. వేదాత్మయైన జానకీపతియైన రాముఁడు వేఱు. ఇతఁడు వేదతత్త్వ సంరక్షణఁ జేసెడివాఁడు. జానకి ననుసరించెడి వాఁడు. మూఁడవవాఁడు రఘురాముఁడు. ఆయన అయోధ్య రాజు, దశరథ మహారాజు కుమారుఁడు. అందుకనియే తనయవతార కార్యమైన రావణవధమైపోయిన తరువాత పదివేలేండ్లు బ్రతికి రాజ్యమును పాలించెను. శా. ఒక్కప్డిద్దఱి లక్షణంబులకు సంయోగంబు కన్పించు వే ఱోక్క ప్డూరక మోక్షదాత యనగా నొప్పారు, నొక్కప్డు తాన్ జక్కన్ వేనికొ శాపనిష్కృతికినై జన్మించినట్లుండు తా నొక్కప్డెంచిని వట్టి మానవుఁడుగా నుండున్ సదాదుఃఖియై రావణ వధ, సీతాసమయ రక్షణ రెండు నొకటిగాఁగన్పించును. మఱి జటాయువు, శబరి, గుహుఁడు,విభీషణుడు మొదలైన వారి విషయమును చూచినచో మోక్ష దాతయైన పరమేశ్వరుఁడుగ కన్పించును. అహల్య, కబంధుఁడు, విరాధుఁడు మొదలైన వారిని చూచినచో వారి శాప నిష్కృతికై పుట్టి నాఁడా యనిపించును. మఱింకొక్కప్పుడు వట్టి మానవుడుగా కనిపించును. సీత నెవఁడో యెత్తుకొని పోయినాఁడని యేడ్చుట, యెవని యింటనో యొక యేఁడాది యున్నదని భార్యను నిరాకరించుట, ఎవఁడోయేదో అన్నాఁడని భార్యను పరిత్యజించుట, యీ రాముఁడు చిత్రచిత్రముగా నున్నాఁడు. దేశ కాలములకు బద్ధుఁడు, దేశ కాలాతీతుఁడు, దేశకాలములను నియమించెడివాఁడు మోక్షమున కధికారి. మ. అకటా రావణు వంశనాశనముఁ జేయ గోరఁడాస్వామి యా యక¸° జానకికోర్కి యయ్యది తదీయారంభ మేలాటిదో ప్రకటంబౌ నొకశక్తియో గుణమొ సంబంధించకుండంగఁదా నొక యానందము సత్వమేమి పనిచేయున్ వట్టిభావంబుగా రాముఁడు విష్ణ్వతారమైనచో రావణ వంశ నిర్మూలనముచేయఁడు. ఆ రాక్షసుఁడు దుర్మార్గుఁడన్నచో స్వామి వాని నొక్కనినే చంపును సోమకుఁడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుఁడు, రదవీంద ఱుదాహరణములు, వంశ నిర్మూలనము చేయఁడు. ఇది సీతాదేవి కోరిక. ఆమె యెందు కిట్లు చేసినదో. ఆమె బలవంతము వలన రాముఁడు రావణ వంశ నిర్మూలనము చేసెను. ఆమె మహాశక్తి. ఆమె సృష్టిని పరిపాలించదు. రాముఁడచ్చమైన సత్వగుణము. ఆనందము కావచ్చును. ఆనందమేమి చేయును. అదివట్టి యనుభూతి వ్యవహారము. సత్తగుణము కూడ నంతియే. శక్తియైన రజస్తమోగుణములు లేకుండ సత్తగుణ మేమియుఁజేయలేదు. అందుకనియే యొకసారి ముద్ధములో రాముఁడు రావణునిచేత దెబ్బలు తిని అమ్ములపొదిలో నుండి బాణమును కూడ తీయలేని స్థితిలో నిలిచి పోయినాఁడు. అప్పుడు శక్తియైన రజోగుణ మాయన నాశ్రయించినది కోపముఁ దెచ్చికొని రావణుని పదితిట్లు తిట్టినాఁడు. అప్పుడు రాముని బలశౌర్యములు రెండు రెట్లయినవి. ఇది చమత్కారము. జానకి స్వతంత్రత వహించినచో రాముఁడేమియు చేయలేఁడు. వట్టి సత్తగుణము ఆనందము. శా. తన్నుం బంపెను మాయలేడికయి యంతన్ లక్ష్మణున్ నోటితో నెన్నాడన్ వలె నన్నియాడినది యేలాయిద్ది యాదుష్టుఁడున్ దన్నుం దొంగిలినట్లు చూపవలె వింతల్ గా సముద్రమ్ము దా టన్నేర్వన్ వలె ముట్టడింపవలెఁ గోటన్ బెద్దయుద్ధంబుగా. రాముఁడు వట్టి సత్త్వగుణము. స్థితి కారకుఁడన్నమాట నిజమే. శక్తి తన్నావరించినచో స్థితి కారకుఁడే. అప్పుడు త్రిగుణాత్మకుఁడు. అట్లయినచో రాముఁడు రావణుని కన్నుమూసి కన్ను తెఱవకముందు చంపును. ఈ నాటక మంతము శక్తి యాడినది. మాయలేఁడిగా మారీచుని రప్పించినది. ఆమె మాట కోసము రాముఁడు లేడికోఱకు వెళ్ళినాఁడు. రామునిఁ బంపించినది. లక్ష్మణుఁడున్నాఁడు. ఇతనిని పుల్లవిఱుపు మాటలు మాటాడి పంపించినది. ఎందుకు? రావణుఁడు తన్ను దొంగిలునట్లు చేయవలయును. రావణుఁడు తన్ను తీసికొని పోయిన మార్గము రామునకు దెలియవలె ఆ మార్గముయొక్క గుర్తునకు మొదలు సగము చచ్చి పడియున్న జటాయువు రెండవది సుగ్రీవా దులన్న కొండమీఁద తన నగలమూటను వేసినది. మూఁడవది సంపాతి కథ. నాల్గవది తా నాంజనేయుని వెంటఁబోదు రాముఁడు రావలె, సముద్రముదాటవలె. యుద్ధము చేయవలె. యుద్ధము చేసినఁగాని కోటకొలఁది రాక్షసులు చావరు. ఇంతపని చేసినది సీత. ఆమె వేద తత్త్వము. ఎందుకు చేసినదో మనకు తెలియదు. గీ. ఒక్క చక్రధార యొక్క మహాస్త్రంబు చాలినట్టి పనికి వాలి వధయు కోఁతిసేన, దాటికోలు సముద్రంబు నింత రగద పెంచె నీమె యంచు. రావణవధ పరమసులభము. తనయందు నిహితమైన మహావైష్ణవ శక్తిచేత తా నేపనియైనఁ జేయఁగలఁడు. వైష్ణవ శక్తియతీతమైన మహాశక్తి జానకి వచ్చినది. ఆమె తన వైష్ణవ శక్తిని పని చేయనీయదు. వాలి వధ మొదలైన రగడఁబెంచినది. ఇప్పుడు రామునియందు ముగ్గురు నలుగురు రాములున్నారు. అందులో నొక రాముడు విష్ణ్వవతారమైన రాముఁడు.ఈ రాములలో నొక్కొకప్పుడు నిద్దఱు ముగ్గుఱు కలసియుందురు. ఈ యవతారమైన రాముఁడు, మానవుఁడైన రాముఁడు, కలసి యీమె సులభముగా తేలిపోయెడు పనికింత రగడ పెంచిన దని కోపము పొందినాఁడు.ఈ కోపమే సీతచేత నగ్ని ప్రవేశము చేయించుటకు కారణము. ఆమె మహాశక్తి ఆమెకీ కోపములు తాపములు పట్టవు. చం. ఇటు రఘరామ చంద్రుఁడును నిట్టులవచ్చిన వేదమూర్తి మి క్కుటముగ రాము లిద్దఱును గూడినయట్లుగ నొక్కవత్సరం బట వసియించె లంకనని వ్యాజమతో రఘువంశగౌరవ త్రుటనముపెట్టి యగ్నిఁ బడద్రోసెను రాముఁడెఱుంగ నట్లుగన్. ఇది యాయిద్దిఱు రాములు చేసినపని ఎఱుగనట్లుగా రాముడామెనగ్ని ప్రవేశము చేయించెను. ఆమె మహాగ్ని యేమియుఁజేయలేదని రామునకు దెలియును. ఏ రామునకిఁ దెలియును? వేదమూర్తి యయిన రామునికిఁ దెలియును. మహావిష్ణువైన రామునికిఁ దెలియును. ఏ రామునికిఁ దెలియదు? రఘువంశము నందుఁబుట్టిన రామునికిఁ దెలియదు. మనావుఁడైన రామునికిఁ దెలియదు. ఈ యిద్దఱు రాములును గలిసి మొదటి యిద్దఱు రాములను పెడ ద్రోసి యామె నగ్ని ప్రవేశము చేయించిరి. ఆమె మహాశక్తి స్వరూపిణి యని మొదట యిద్దఱు రాములకుఁ దెలియును. చివరి యిద్దరు రాములకుఁ దెలియదు. ఉ. క్షోణిజ దేవికా ఫలము చూపెనుబో రఘురాము నందునన్ తాను పరీక్ష చేయఁబడుదానికి ధారుణిఁ జొచ్చె దివ్య సం తాన మొసంగెరావణువధన్ తనతీర్పుగ చేసినందుకున్ జానకికాదు హేమమయి జన్నపుఁబీటలయందు లక్ష్మియై. ఈ మహాశక్తి రాముని యందు నే పనికా ఫలము నొసంగెను తన్నుఁబరీక్ష చేసినాఁడు కనుక దానికి శిక్షగ తాను భూమిలోనికిఁ జొఱబడినది. తాను మఱల రాముని భార్య కాలేదు. తనకోసము రాముఁడు రావణ వధ చేసినాఁడు కనుక రఘవంశము నిలబెట్టుటకు రామునకు కుశలవులను కొడుకుల నిచ్చి పోయెను. ఆ శిశివులు గర్భము నందుండగా తాను భూమిలో నంతర్హితురాలు కాలేదు. ఇప్పుడు రాముడు అశ్వమేధ యాగము చేయుచున్నాఁడు. పీటల మీఁద జానకి భార్యగా కూర్చుండ వలయును. తాను కూర్చుండలేదు. రాముఁడు బంగారముతో సీతబొమ్మఁజేయించి తనకు ధర్మపత్నిగా కూర్చుండఁబెట్టు కొనెను. బంగార మనగా నెవరు? లక్ష్మీ దేవి. అందుచేత రాముఁడు విష్ణువైనచో నతని ప్రక్క కూర్చుండ వలసినది లక్ష్మి; తాను కాదు. తాను వేదాత్మ - మహాశక్తి తాను తనపని కోసము వచ్చెను. రామునిచేత చేయించెను. తన దారిని తాను వెళ్ళెను. పెండ్లి సమయమునందు పట్టాభిషేక సమయము నందు సీత రామునితో పీటలపై కూర్చున్నదో లేదో! తాను వేదమూర్తి. యజ్ఞము వేద కర్మ. అక్కడ రామునితో పీటలమీఁద కూర్చుండదు. ఇది సీతాదేవి చేసిన చేత, రామునిచేత పని చేయించినది, అనుగ్రహము చూపినది. రామునెట్లు శిక్షించవలెనో అట్లు శిక్షించినది. చివరకు మిగిలిన రాముఁడెవఁడు? వట్టి రఘురాముఁడు రఘువంశము సాగుటకు నేర్పడిన లవకుశుల తండ్రి. All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?oldid=31036.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|