Revision 31048 of "నా రాముడు/అవతారమూర్తి (నా రాముడు)" on tewikisource{{నా రాముడు}}
అవతారమూర్తి
మ. మదియోగించిన సృష్టియిద్ది యొక పద్మవ్యూహ మిచ్చోట ని
ట్టిది యిచ్చోటిది యిట్టిదంచును పరీష్టిన్ జేయcగానైన వీ
లొదవన్ రానిది యెన్నొరీతులుగ నెంతోమందిచేc జెప్పcబ
డ్డది యీ దీనికి మూలభూత శిపివిష్టత్వంబు విశ్వాస్యమై
ఈ సృష్టి యిట్టిదని చెప్పుటకు వీలులేదు. ఇచ్చట నిట్లుండు ననుటకు వీలులేద. ఈ సృష్టియొక్క మొదలును గూర్చి వేయిమంది వేయి విధములుగా చెప్పిరి. దీనికి అసలు కారణము తెలియదు శిపివిష్ట శబ్దమునకు శబ్దమునకు శివుcడు. విష్ణువునని రెండర్ధములు కలవు. అందుచేత శిపివిష్టత్వంబు శివుcడా విష్ణువా? అన్న భావము విశ్వాస్యమై-విశ్వసింపc దగినదై యున్నది భిన్న మతస్థులు భిన్నముగాc జెప్పవచ్చును. మానవ బుద్ధిలో దీనికి నిర్ణయములేదు. వేని మత మేదియో వాcడు దానిని విశ్వసించును.
శా. ఈ లోకమ్ములు రక్షసేయుటకునై యేర్పాటు కాబడ్డ వాc
డాలోచింపcగ విష్ణుమూర్తి యొకcడే అచ్చో వికుంఠమ్మునన్
హేలామూర్తిగ నుండు సర్వమునc దానిచ్చోc బరిష్కారపున్
లీలామూర్తిగ లోకసంభరణ కేళీలోలుcడై పొల్చెడున్.
సృష్టి జరుగుచున్నది, జరిగినది, సృష్టి యారంభించిన వెంటనే సృష్టి చేయుట, యీ సృష్టిని రక్షించుట, యీ సృష్టిని సంహరించుట అన్నమూcడు కార్యము లేర్పడినవి. సృష్టి చేయుటయు రక్షించుటయు సరే. సంహరించుట యెందులకు? ఎప్పటికప్పుడు సంహరింపనిచో నీసృష్టికి స్థలముచాలదు. మానవుల సంఖ్య చెప్పుటకు వీలులేకుండ పోవును. భూభాగము పట్టుటకు వీలు లేకుండ పోవును. వీరందఱు తినుట కుండదు. తిండిలేకుండ చావులేకుండ నున్నచో జనము పుట్టుచుందురు. ఈ భూమి యేమికావలయునో తెలియదు. అసలు సృష్టియెందుకు; క్రొత్తగా మనుష్యులు పుట్టుట యెందుకు? ఈ స్త్రీ పురుషు లెందుకు? అందుచేత సృష్టి జరుగుచున్నది. అందుచేత లయము జరిగి తీరవలెను. లేనిచో భూమి పట్టదు. ఈ నడిమికాలము రక్ష చేయవలయును. రక్ష యెందుకు? పుట్టిన జంతువులు చచ్చెడి వఱకు వాని యిష్టము వచ్చినట్లు ప్రవర్తించును. అసలు సృష్టి యెందుకు చేయబడ్డదో మనకుc దెలియదు. చేసినవాcడు, చేయcబడ్డ జనులు బ్రదికియున్న కాలమున న్యాయ్యముగా నడువ వలయును. అందుచేత రక్షకుcడు. విష్ణుమూర్తి రక్షకుcడు గదా! ఈ యవతారములు మొదలైనవి విష్ణుమూర్తి యెత్తును. సృష్టి కర్తయైన బ్రహ్మకుగాని లయ కర్తయైన శివునకుగాని దీనితో పట్టదు. ఇది మర్మము. కాని,
ఉ. మువ్వురు నొక్కటే మఱియు మువ్వురు మువ్వురె శక్తియట్లుగా
గ్రువ్వెనదేమి లేనియెడc గోరిక గల్గెను శక్తి యుండినన్
గ్రవ్వును కోర్కి శక్తి యమరున్ మఱియెవ్వని యందొవారలున్
మువ్వురు, శక్తి మువ్వురయి పొల్చెనుధాత్రి సమస్తపాలనన్.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురు నొక్కటియే. ఒక్కటి యగు బ్రహ్మ పదార్థము నుండియే మువ్వురు పుట్టిరి. ఈ మూర్తులు తీసివేసినచో నీ మువ్వురును బ్రహ్మ పదార్థమే. ఈ మువ్వురును హేలామూర్తులు. అనcగా వారికి నిజముగా నిది యేమియుc బట్టదు. కాని యీ సృష్టి కోసమిది చేయుచుందురు. అందకనియే వెనుకటి పద్యమున ''విష్ణుమూర్తి యొకడే అచ్చోవికుంఠమ్మునన్ హేలామూర్తిగ నుండు సర్వమున'' అని వ్రాయcబడినది. ఈ మువ్వురకు మూcడు శక్తులు కలవు. సృష్టి స్థితి లయకార శక్తులు. శక్తియున్నది గనుక ఆ పని చేయుదురు, శక్తి చేయించును, కనుక శక్తి ముఖ్యమైనది. శక్తి లేనిచో నెవ్వcడు నేమియుc జేయలేడు. శక్తిలేనిచో బ్రహ్మ, విష్ణు మహేశ్వరు లీ పనిని చేయలేరు. అందుచేత శక్తి ప్రధానమైనదిగ కనిపించు చున్నది. ఆ శక్తి యెరు? ఆమెయు బ్రహ్మ పదార్థమే. శక్తిగా మొట్టమొదట తోcచినది. ఆమె యీమువ్వురుగా మారినది. ఈ మువ్వురి యందు తన్నుతాను పంచుకొన్నది. అందుకనియే సౌందర్య లహరిలో ''శివశ్శక్త్యా యుక్తో యదిభవతి శక్తః ప్రభవితుమ్'' అని చెప్పcబడ్డది. ధాత్రి సమస్తపాలన మనcగా సృష్టి స్థితిలయము లని యర్థము.
ఉ. శక్తియదెప్పుడున్ వెనుకచాలుగ నుండును ముందుతోcచెడున్
శక్తిగలాడు, శక్తియునుజాలక యాతడు లేనెలేcడ యా
శక్తియు రూపధారిణి యెసంగుట, దైవము లార్వురౌచు నా
శక్తియు వెన్కయై మఱియు శక్తికలట్టిఁడు ముందరైచనన్.
ఇది రహస్యము. శక్తి కనిపించదు. శక్తికలవాఁడు కనిపించును. శక్తి లేనివాఁడు లేనేలేఁడు. అనఁగా నెందుకు పనికిరాడు. వాని ప్రసక్తిలేదు. శక్తి కల్గిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు రూపము లున్నవి. శక్తికి రూపములేదా ? శక్తికిని కలదు. ఈ రూపము లెట్టివి? మానవుఁడు సృష్టిని పర్యాలోచించుచు పరమార్థములను విచారించుచు నీ దైవములను కల్పించుకొని ఆ దైవములకు మానవుల వంటి రూపమునే ఇచ్చి ఆ దైవముల ననంత శక్తిమంతులనుగ చేసి వారి నారాధించు చున్నాడు. ఇది సృష్టి లక్షణము. ఈ యారాధన వలన మొట్టమొదట తాను దైవముల వంటివాఁడై తరువాత తానుకూడ బ్రహ్మ పదార్థములో కలిసి పోవలయునన్న యొక గాఢమైన కోర్కికలవాఁడు. ఈ మార్గమంతయు ఋషులు చూచిరి. ఋషులు వెదకిరి, ఋషులు నిర్ణయించిరి. ఈ సృష్టికి వేరేగతి లేదు గనుక దీనికి గతి కావలయు ననఁగా నది యొక్కటియే మార్గము. ఈదైవములకు రూపకల్పనఁ జేసినవారు శక్తికికూడ చేసిరి. కనుకనే శక్తి రూపధారిణియైనది. ఇందులో నొక చమత్కార మున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మువ్వురు. వీరికి వెనుక బ్రహ్మ పదార్థమున్నది. అవసరము వచ్చినచో నా బ్రహ్మ పదార్థమునకు వీరికి నభేద ప్రతిపత్తి. అట్లే శక్తి పార్వతీ లక్ష్మీ సరస్వతులైనది. వారి మువ్వురి వెనుక శక్తియున్నది. బ్రహ్మ పదార్థము లేదా యన్న ప్రశ్న. ఆ శక్తియే బ్రహ్మ పదార్థము. అచ్చట శక్తికి బ్రహ్మ పదార్థమునకు నవినాభావ సంబంధము. కాని క్రియా జగత్తునందు శక్తికల వాఁడు ముందర, శక్తివెనుక. ఇందులో నింకను రహస్యములు కలవు.
ఉ. అందఱు నొక్కటే తెలివి, యందఱు నొక్కటె శక్తి, రూపమున్
జెందుట వేఱువేఱుగను, చేసెడిచేతలు వేఱువేఱుగా
బొందిన శక్తి వేఱగుచుఁ బొందిన శక్తియువేరునౌచు నా
నందమయుండు రక్షణ సనాధత యొక్కటిరెండునై చనున్.
కనిపించున దారుగురు. పరమార్థ మొక్కటియే. శక్తులు వేఱువేఱుగా నుండును. చేసిన కార్యము శక్తినిబట్టి యుండును. ఈ పథకములో విష్ణువు రక్షణ సనాథుఁడు. రక్షించుటతో కూడుకొని యున్నవాఁడు. స్థితికారుఁడు ఆయన కిచ్చట 'ఆనందమయుఁడు' అని వాడఁబడినది. ప్రత్యేకముగా విష్ణువే ఆనందమయుఁడని కవి చెప్పుచున్నాఁడు. విచారించినచో సారూప్యము సాలోక్యము మొదలైన వట్లుంచి మోక్షమునకు వ్రథమ మార్గదర్శి ప్రథమోపాసనా పరుఁడు ప్రథమ ధ్యేయుఁడు విష్ణుమూర్తిగా కనిపించును. అందుకనియే భగవద్గీతాదులు విష్ణువును గూర్చియే చెప్పును. మానవునకు-కనీస మధిక సంఖ్యాకులైన వారికి భారతీయులలో నని యర్థము. విష్ణువుపాస్య దైవము-ఆ విష్ణువెవరు? ఈ కావ్యమునందు ఆనందమయుఁడు. మానవుఁడు పొందెడి మోక్షము యొక్క స్వరూపము ఆ యానందమయత్వము ఇది యొక కావ్యము. కావ్యము లాస్వాదించెడు వారు పొందెడిది రసము. ఆ రసమును పొందినవాఁడు ఆనందియగుచున్నాడు. వాఁడే ఊపిరి తీసికొనుచున్నాఁడు. వాఁడే బ్రదుకుచున్నాఁడు. కావ్య రసాస్వాదన తత్పరునకు ఆనందమయుఁడే యున్నాడు. వానిని పొందుటయే మోక్షము. అందుచేతనే యిచ్చట నానందమయ శబ్దము వాఁడుట. ఈ ఆనందమయుఁడు మనకు రాముఁడు. ఆయన విష్ణుమూర్తి యవతారము కద ? అనగా విష్ణువుయొక్క యంశను స్థితికారకత్వమును స్థితిని ధ్వంసము చేయుచున్న రావణుని సంహారము కొఱకు విష్ణువుయొక్క యంశమును దెచ్చుకొన్నవాఁడు. అందుచేత నవతారము. ప్రధానముగా ఆనందమయుఁడు. కనిపించుటకు రాముఁడు. ఇదియే తరువాతి పద్యము.
మ. అలవైకుంఠమునందు మూర్తిగొనితానై తైజసంబెనది
య్యిల విశ్వంభరయందు మూర్తిఁగొని యట్లేపంచభూతాత్మకం
బలఘుండె జగదేక రక్షకుఁడునై యానంద రూపుండున్తె
వెలయున్ రాముఁడు తాను బ్రహ్మమయతా విష్వఙ్మహో
మూర్తియె.
ఈ రాముఁడు వై కుంఠమునందు తైజసమైన మూర్తిఁగొన్నాడు. అనగా మహావిష్ణు వైనాఁడు. విశ్వంభరకు వచ్చి పంచ భూతాత్మకమైన శరీరమును స్వీకరించినాఁడు ఈయనకు రెండు లక్షణములు కలవు. మొదటిది ఆనందమయత్వము. రెండవది జగద్రక్షణత్వము. ఆనందమయత్వము విష్ణువుగా నుండునప్పు డుండునుగాక లేకపోవునుగాక. రాముఁడుగా నున్నప్పుడు నిస్సందేహముగా నున్నది. ఇది విష్ణురూపము నందుకంటె శ్రీరామచంద్ర రూపము నందు నధికముగా నున్నదా యనిపించెడు లక్షణము. 'బ్రహ్మమయతా విష్వజ్మహోమూర్తి' బ్రహ్మ పదార్థమేయైన సర్వత్ర వ్యాపించిన మహస్సుయొక్కరూపము. మహస్సు-తేజస్సు. ఇచ్చట మరల 'మయ' ప్రత్యయమున్నది 'ఆనందమయ' లో సందిగ్ధము కావచ్చును. ఇక్కడ కాదు. శ్రీరామ చంద్రుడు బ్రహ్మయొక్క వికారము. అనగా బ్రహ్మమే తాను. తానే బ్రహ్మము.
చం. ప్రిదిలి వికుంఠమం దవతరించెను భూతలమందు నన్నచో
ప్రిదివిన తై జసంబగు శరీరము గాఁగను బాంచభౌతికం
బిదియొక రూపమున్ మఱి వహించెను వేఱుగ నన్నమాటయ
య్యది యిది రెండు రెండగుచు నైక్యమువైష్ణవశక్తియందుగాన్
అవతరించుటయనగానేమి? స్వామి వైకుంఠమునందున్నాడు. అక్కడి యాయనమూర్తి తైజసము అనగా తేజోమయము. ఇక్కడికి దిగినాడు. ఇక్కడి మూర్తి పాంచభౌతికము. అవి రెండును రెండయినను వైష్ణవశక్తి యందొక్కటియే పాంచభౌతికమైన దేహము మనకు గనిపించుచున్నది. తైజసమైనది కనిపించుటలేదు. కనుపించుటయనగా నేమి? మనుష్యులకు చర్మచక్షుస్సులు కలవు. ఈ కన్నులకున్న శక్తి స్వల్పము. ఈ కన్నులు పాంచభౌతికములైన వానినే చూడగలవు. తైజసములైనవానిని చూడలేవు. కంటికి కొంత మేరయే కనిపించును. దూరాలు కనిపించవు. కనిపించనివి మానవుఁడు కనిపించినట్లు భావించును. చూచుటయనఁగా నెక్కువభాగము భావించుట. చూచునప్పుడు కూడ నిజానకు భావించుటయే. ఆ కంటివెనుక నిజమైన కన్నున్నది. ఆ కన్ను భావనా మయము. ఆ భావన కొన్ని పరిధులలో నుండును. విందుము. కందుము. రుచిచూతుము. స్పృశింతుము. ఈ మొదలైనవి శరీరము యొక్క యవధులలోనుండి వానికి తెలసినంతవఱకు భావించుట. పాంచభౌతికమైన శరీరము స్థూలము. అందుచేత నీ యనుభవములు స్థూలములు. ఒక బంధువు వేయిమైళ్ళ దూరాన నున్నాఁడు వానిని చూచుచున్నామనిపించవచ్చును. అనగా వాని శరీర లక్షణములు భావనాగతమైయుండును దీనిపేరు స్మృతి. కొందఱు దీనిని చూచుటగా భావింతురు. ఇట్టి స్మృతి చనిపోయినవారియందు కూడ నుండును. భేదమేమనగా మొదటిది బ్రతికియున్నవాని రూపముయొక్క స్మృతి, రెండవది చనిపోయిన వానియొక్క రూపముస్మృతి చూచుటలేదు. స్మృతిని చూచుటగా భావింతురు. చూచుటయనగా పాంచభౌతికమైన వస్తువునకు మన చర్మచక్షుస్సులకు సంబంధము కలిగియుండుట. సహజముగా మానవులు చర్మచక్షుస్సులచేతనే చూతురు. దూరవస్తువులను చూచుట యనగా నిదివఱకు తెలిసికొని యుండుట కనకనేమగుచున్నది? చూచుటయు స్మరించుటయు పూర్వమెఱిఁగి యుండుట యని యర్థము. రెండునుకలిసి తెలిసికొనుట అన్న విషయము తేలుచున్నది. కనుక శరీరమునకు ప్రాధాన్యము లేదు. మనస్సునకు ప్రాధాన్యము. ఇప్పుడుమనది పాంచభౌతికమైన శరీరము. దేవతలవలె తైజసమైనశరీరముకాదు. తైజసమైన శరీరమును చూచుటకుఅనగా తెలిసికొనుటకు తెలివి కావలయును. కాని చర్మచక్షుస్సులు పనికిరావు. ఈ చర్మచక్షుస్సులు నిజముగా చూడఁగల దూరమే స్వల్పము. చూచినదాని నొక్కొక్కప్పుడు మరచిపోదుము. అనగా తెలివి మరుగుపడును. ప్రధానము తెలివి. ఈ చర్మచక్షుస్సులతో చూచుటయందే శ్రద్ధవహించిననే సరిగా కనిపించును. శ్రద్ధలేనిచో కనిపించదు. నీవా దారినే వచ్చితివి కదా? 'వాఁడు నీకుకనిపించెనా?' యనియడుగును. వీఁడుతనకు కనిపించలేదనును వాఁడాదారిలోనే యున్నాడు. ఎందుకు కనిపించలేదు. వీఁడు మఱిదేనినో భావించుచు వానిని చూడలేదా ? చూచినాఁడు. శ్రద్ధ యితరత్ర యుండుటచేత వాఁడు కనిపించలేదు. కనుక కనిపించుటకు కావలసినది శ్రద్ధయు తెలివియు, అప్పుడు కొన్నింటి విషయములో చర్మచక్షుస్సులు పనిచేయవు. వాని పరిధి తక్కువ. తైజసములైన శరీరములున్నవి. వానిని చూచూట కీకన్నులు చాలవు. వానిని చూచుటకు ఒక శ్రద్ధ, ఒక మనస్సునిలుకడ. ఒక ధ్యానము, ఒకయేకాగ్రత, ఒక విశ్వాసము కావలయును.
'భగవంతుఁడు వైకుంఠమునందున్నాఁడు' అని యన్నాము. ఆయనది తైజసమైన శరీరము. ఆయన ఆ శరీరమును వదలి పాంచభౌతికమైన శ్రీరామచంద్రుని శరీరమును తాల్చినాఁడు. ఇది యెట్లు సంభవము? అసలు మొదట తైజసమైన శరీరమెట్లు సంభవమైనది? వీనియన్నింటికి కారణము దేవతల విషయములో సంకల్పము. మానవుల విషయములో కర్మయు సంకల్పము రెండును. నేను లోకరక్ష చేయవలయును. నేను విష్ణుమూర్తిని. నేను బ్రహ్మవిష్ణు మహేశ్వరులలో నొకఁడను. ఈ సృష్టిని రక్షించుచుండుట నా విధి, నాధర్మము. అనెడి ఒకగాఢమైన సంకల్పము విష్ణువునకు కలదు. ఆయన బ్రహ్మపదార్థమై అందులో నితర భాగములు కొన్ని సృష్టిని భావించి సృష్టిని చేసిననడుపుచుండఁగా నీ విష్ణువైన సంకల్పభాగము రక్షించుటకు విష్ణువైనది. ఏ భాగము, ఏసంకల్పముతో ఒక మూర్తిని స్వీకరించునో ఆ సంకల్పము వెనుకనున్న విజ్ఞానమునకు నా శక్తియున్నచో నామూర్తి దానిని నిర్వహించుటకు సమర్థమగుచున్నది. దానికిఁ దగిన శక్తి వానిసంకల్పములో నున్నది అట్లే జీవుఁడు తనకర్మ ననుభవించుటకు తానొక మానుష జన్మయెత్తుచున్నాఁడు వాని కర్మయెట్టిది? ఆ దేశములో ఆ ప్రారంతములో ఆయన్నోదకములు కలిగిన యింటిలోనో లేనియింటిలోనో వాని కర్మముకొలఁది పుట్టుచున్నాఁడు. ఇదియంతయు కల్పిత మందము. సర్వమానవులొక్కటియే యందము. ఒక్కటియే యన్నను ఆ ప్రాంతములో నొకఁడు రాజు, ఒకఁడు సైనికుఁడు, ఒకఁడధికారి, ఒకఁడు వర్తకుఁడు, ఒకఁడు పొలము దున్నెడివాఁడు. ఈ భేదములు మానవ దృష్టికి సహజములుగ కనిపించవచ్చును. కాని అనుభవములో బోలెడంత భేదముండును. పాలకుఁడైన జీవుఁడు విమానములఁమీద తిరుగును. పొలము దున్నెడివాఁడు తిరుగలేడు. సైనికుఁడు హఠాత్తుగా చావవచ్చును. పొలము దున్నెడివాఁడు దీర్ఘకాలము బ్రదుకును. ఇందులో వ్యాధులున్నవి. ఎవనికి వచ్చునో ఎందుకు వచ్చునో తెలియదు. ఒక్కఁడు చికిత్సాలయమునకు సమీపమున నుండును మరియొకఁడు దూరముగా నుండును. ఇవి యనంతభేదములు. అందఱు మనుష్యులొక్కటియే యని మనమెంత ఘోషించినను పూర్వజన్మకర్మయనునది వెంటాడుచునే యున్నది. తెలివితేటలు వచ్చిన తరువాత నీవు మానవుఁడవు. తత్పూర్వము నీవెవఁడవు? చిన్నప్పుడే చనిపోయినచో నీవేమగుదువు? పుట్టుకలోనే అంగవైకల్యముతో పుట్టిన నేమగుదువు? కనుక కర్మయున్నది. కర్మయున్నది గనుకనే యొకఁడు సుఖముగా బ్రదుకఁగల దేశములో పుట్టుచున్నాడు. మరియొకఁడు దుష్టులు పరిపాలించుదేశములో పుట్టుచున్నాడు. అన్నియుగలిసి ఆయాదేశములందు పుట్టి కర్మవశమునవాఁడు కూలివాడగుచున్నాఁడు. అందరు సమానమనుట ఆన్నోదకములకు సమానమనుటలో తప్పులేదు.
అనగా జీవుఁడున్నాడు. జీవుఁడు లేడనువారు కలరు. వాడుంటయు లేక పోవుటయు వీని తెలివితేటలమీఁద నాధారపడిలేదు. ఒక పెద్ద కట్టెటమోపున్నది. అందులో నొకకట్టెమోపులో క్రిందనున్నది. తన స్థితి యాదృచ్ఛిక మన్నచో కాదు. మోపుకట్టినవాఁడు తాను మోయుటకు వీలుగా నాకట్టకట్టెను.
జీవుడు లేఁడు. ఈ శరీరమెత్తి పెరిగిన తరువాత నీతెలివి యేర్పాటగుచున్నది. ఒప్పికొందము. పుట్టుట యెట్లు? పెరుగుట యెట్లు? అక్కడనే పుట్టుట యేమి? కార్యకారణభావము నంగీకరించకపోయినచో సృష్టిలో దేనికి సమాధానము లేదు. అన్నియు నసమాధేయములైన విషయములైనచో నిదియొక కలగూరగంప. చిత్తుకాగితముల ప్రోగు. కాని యిందు లోనొకనడక. ఒక పద్ధతి, ఒక నీతి, ఒక పథము మొదలైనవి. కనుపించుచున్నవి. ఇవి యన్నియు వెనుకనున్న యొక తెలివిని సూచించుచున్నవి. ఇన్ని భిన్న పరిస్థితులయందు నట్టి తెలివి చెడకుండనున్నది. అది తెలివి, అది వివేకము, దానికిఁ గారణము జీవుఁడు ఆత్మ. వీని నంగీకరించుట మానవునియొక్క మానవత్వము.
ఇప్పుడు విష్ణువున్నాఁడు. ఆయనది తైజసమూర్తి. రాముఁడై జన్మించినాఁడు. ఇది పాంచభౌతికమైన మూర్తి. రెండును రెండు మూర్తులయినను లోనున్న శక్తియు వివేకము నొక్కటియే. ఇది యవతారము. ఆ మూర్తియెట్లు వదలిపెట్టినాఁడు. ఈ మూర్తినెట్లు స్వీకరించినాఁడు? పురుషుని రేతస్సు స్త్రీ గర్భమునందు నిహితమై రూపము కట్టుటెట్లు? పెరుగుట యెట్లు? మన శాస్త్రములు వీనికి హేతువులను చెప్పలేవు. శాస్త్రమేమి చేయుననగా ఉన్న వానిని ఇది యిదియని విడబఱిచి చూపించును.ఇది తెలియలేదందువు.అదియును తెలియలేదు. తెలియకపోవుటయనగా నీ తెలివిలోని కొరత. ఈ పంచభూతములను నీవు సృష్టించలేదు. ఈ పాంచభౌతికమైన శరీరమును నీవేర్పాటు చేయలేదు. చెట్లను చేమలను నీవు సృజించలేదు. పెంచలేదు. నీవుసృజించినది విమానము. అయోమార్గము. ఆకాశవాణిని నీవు సృజించితి నన్నచో నీవు సృజించినది యంత్రములను, వదలిపెట్టుట స్వీకరించుట యన్న రెండు యంత్రములను కనిపెట్టితివి. ఆ ధ్వని గాలిలో ప్రసరించుట నీవు సృష్టించలేదు. పాంచభౌతికమైన శరీరమును రాముఁడు స్వీకరించెననగా నతఁడు స్వీకరింపగలడు. మానవులు కర్మాధీనులై స్వీకరించుచున్నారు. ఇదీభేదము. పంచభూతములను సృష్టించినదే ఆయన. అవి వానినొక రూపముగ నేర్పాటు చేసినదే ఆయన. నీ జీవుఁ డల్పవిజ్ఞాత. ఆయన జీవుఁడు సర్వ విజ్ఞాత. సర్వవిజ్ఞాత. జీవుఁడు కాఁడు. పరమేశ్వరుఁడగుచున్నాఁడు. సర్వశక్తిమంతుఁడగుచున్నాఁడు. మానవులలోనే వివేక తారతమ్యమున్నదిగదా. ఒక డధిక వివేకి యున్నాఁడుగదా? వాఁడు పరమవివేకి. సృష్టిలోను సృష్టికి వెనుకను ముందును నడుమను సర్వవివేకము కలిసియున్న యొక శక్తిని పరమవివేకిలోని వివేకమును భావించినట్లే భావించినచో ఆ వివేక మీశ్వరుఁడగును. వాఁడు రాముఁడు. అతఁడెందు కవతరించలేఁడు?
చం. ఒక యవతార మంచనిన నున్నది దేహము నద్ది పాంచభౌ
తికమిది దేహమన్నయెడ దేహమె యైనను లోనలోకర
క్షకమగు తేజుచే వెలుఁగు కావడి కంబమువోలె నొప్పుసొం
పుకిరణకాంతి మాఘవతముల్ మణులై యిలుకట్టినట్లుగన్.
అవతారమెత్తెననగా దేహమును తాల్చెనని యర్థము దేహముదేహమే. దేహమనఁగా తగులఁ బెట్టబడునది. శరీరమనఁగా జాఱిపోవునది. నశించిపోవునది. అందుకనియే వైకుంఠమునందలి స్వామిని మూర్తియని పేర్కొనుట. రామునిది దేహమనుట. ఈ దేహమునందు లోకములను రక్షించెడి వైష్ణవమైన తేజుకలదు. తేజస్సు సంస్కృతము, తేజు తద్భవము. అనగా తెలుఁగు. ఈ దేహమెట్టిది? మాఘవతములు మఘవుఁడనగా నింద్రుఁడు. దానిమీఁది తద్థితరూపము మాఘవతము. ఇంద్రుఁడు నల్లనివాఁడు. మాఘవతముల్ మణులనగా నింద్రనీలములు. ఆ మణులతో నిల్లుకట్టినచో నీరాముని శరీరము నడిమిస్తంభమువలె నున్నదఁట. ఆ కంబము మీఁదనే గృహమంతయు నిలిచియున్నది. ఆయన సర్వజగద్రక్షకుఁడని యర్థము.
మ. వరలన్ దల్లియుఁదండ్రియున్ బెరుగుటల్ బాల్యంబునున్
బెండ్లియు
ర్వర నీమానవజాతియెట్లొ అటులే వైరంబులున్ చెల్ములున్
బొరి నీనా మొదలైన భేదములునున్ బొల్పారునై నన్ నవ
స్ఫురణం బొల్చును లౌకికేతర మహాశోభాసనాథంబుగన్.
అవతారమెత్తిన వెంటనే మానవుఁడై పుట్టెను గదా? అందఱు మానవులు పుట్టినట్లే పుట్టిన పుట్టుట, పెరుగుట, పెండ్లి,విరోధములు, స్నేహములు నీవు నేను మొదలైన భావములు నన్నియు నుండును. కాని ఒకటి క్రొత్తగా స్ఫురించుచుండును. ఒకటి యేదో లౌకికేతరమైనది. లోకమునకు సంబంధించనిది ఒక శోభతో కూడికొని యున్నట్లు స్ఫురించును. ఒక మహాయోగికి ఒక మహావివేకికి మనవలెనే శరీరములున్నను వానియోగశక్తియు వాని మహావివేకమును వాని శరీరమును మించికొట్టవచ్చినట్టుండును గదా? అటే శ్రీరామచంద్రునకు దేహమున్నను దేహమునుమించి యితఁడవ తారమూర్తి యితఁడు మహావిష్ణువు. ఇతఁడానందమయుడు అన్నది గ్రహించఁగలవారికి తెలియచుండును. అతడు యోగియని మహావివేకియని గ్రహించగలవారికేకదా తెలిసెడిది. అట్లే!
ఉ. రూపములేని వెల్లగుచు రూపము తాల్చిమనుష్యులంబలెన్
రూపములోకమోహనము రూపము వెల్గుల ప్రోవు కోపమున్
తాపములన్నియున్ మన విధంబున నున్నటులుండుఁ జిత్రమై
లోపలఁ ద్రవ్విచూడవలె లోచన యుగ్మము దేవుఁడిచ్చినన్
ఆయన ఒక తేజస్సు తేజస్సనుటకంటె వెలుగు. వెలుఁగనగా జ్ఞానము. అది రూపము తాల్చినది సద్భావములు కలవాని రూపము దర్శనీయముగ నుండునుగద. ఇఁక వెలుఁగే రూపము తాల్చినచో నెట్లుండును. జగన్మోహనముగానుండును. రాముఁడు జగన్మోహనుఁడుగదా? వెలుఁగులను ప్రోపుపోసి నట్లుండును. కోపములు తాపములు మనవలెనే యుండును. ఆయన వెలుఁగని తెలిసికొనుటకు లోపల త్రవ్వి చూడవలయును. దానికి ఆయనయే అనగా భగవంతుఁడే లోచనయుగ్మమీయవలయును. లోచనమనగా కన్ను. ఆయనను చూచెడికన్ను భగవంతుఁ డీయవలయును. లోచనమన్న శబ్దమువాడఁబడినది. ఈ ధాతువు 'లోచృ' అన్నది. దీనికి దర్శనమని యర్థము. దర్శనమనఁగా వట్టికంటితో చూచుట మాత్రమే కాదుగదా వాఁడామహా విషయమును దర్శించి నాఁడందుము. ఒక మహావిషయమును తెలిసికొనుట దర్శించుట. అందుచేత లోచనయుగ్మమని వాడఁబడినది. అప్పుడొక్కలోచనము చాలుగదా, రెండు కన్నులనుట యెందులకు? మానవుని దర్శనశక్తి రెండు కనులలోను కలిసి యుండును చర్మచక్షుస్సులైనను జ్ఞానచన్సులైనను సంపూర్ణదర్శనము కలుగుటకురెండు కన్నుల శక్తియు కావలయును. వానిని దేవుఁడీయవలయును. యుగ్మశబ్దము. యుగ్మమనగా జంట. అవి రెండును కలసి యున్నప్పుడే చూచుట. ఒక కంటితో చూచుట సగముచూచుట. కుడివైపు కన్పించదు నాకు. లోచన యుగ్మమనుటచేత సంపూర్ణమైన దర్శన శక్తి యనియర్థము.All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?oldid=31048.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|