Revision 31050 of "నా రాముడు/కోదండరాముఁడు (నా రాముడు)" on tewikisource{{నా రాముడు}}
కోదండరాముఁడు
శా. కోదండం బన నాయుధంబగు మహాక్షోణీపతి శ్రేణికిన్
కోదండంబన నాటవస్తువు రఘుక్షోణీట్ సుధారశ్మికిన్
కోదండంబన వంచునో విఱచునో కోటిం గువాళించునో
లేదా త్రచ్చునొ కంధి వ్రచ్చునొ శరాళిన్ దుస్తతపోలోకముల్.
ఈ గ్రంథములో శీర్షికలు లోకములో రామునిగూర్చి ప్రసిద్ధముగా నున్న పేర్లు. కోదండరాముఁడని కూడ మిక్కిలిగా నందుము. కోదండ శబ్దము సంస్కృతముకదా. దానికి వ్యుత్పత్తి యేమనగా దేనిచేత క్రీడింపఁ బడుచున్నదో అది కోదండమని. విలువిద్య నేర్చిన వారందఱి పేర్లకు వెనుక కోదండము చేర్చుటలేదు. శ్రీరాముని మాత్రమే కోదండ రాముఁడందుము. అర్జునుని కోదండార్జునుఁ డనలేదు. శ్రీరామచంద్రునకు తప్ప సృష్టిలో తక్కిన వారందఱికిఁ గోదండ మొక యాయుధము. దానికల్లెత్రాడు. దానిని బిగించుట, బాణము సంధించుట, బాణము వదలుట మొదలుగా నా యాయుధము నుపయోగింతురు రాముఁడట్లే చేయును. కాని. చేయుచున్నట్లెవరికిఁ దెలియదు. కాని, తరువాత నేఁటి యిరువది యెనిమిదవ మహాయుగములో ద్వాపరమునఁ బుట్టిన యర్జునునకుఁ గూడ నిందులో కొంతశక్తి కలదు. ఈ మన్వంతరములో నిరువది నాల్గవ మహాయుగమునఁ ద్రేతాయుగమున జన్మించిన శ్రీరామ చంద్రునకు మాత్రమే కోదండ రాముఁడన్న పేరు గలదు. ఆ ధనుస్సు నాయన వంచునో శివధనుస్సును బోలె విఱుచునో వింటికొసనుండి యేమిచేయునో, సముద్రమును త్రచ్చునో. రాముఁడు సముద్రము దారి యీయనప్పుడు చేసిన పని. పరశురామునియందు ఆయన తపోలోకములను చీల్చినాఁడు. ఇదియెట్లు సాధ్యము? తన బాణపుటమ్ముతోఁ దపోలోకములను వ్రచ్చెనా? నిజముగా కోదండరాముఁడే.
మ. ఇది చేయంగల డిద్ది లేడనుచు లేనేలేద యెదైననున్
బ్రదరాంతంబునఁ జేయఁగా గలఁడు తద్బాణానికె లస్తకం
బది కోదండము నందునన్ కలదు చాపాంతంబు చాపాది దీ
స్తదశా లస్తకమే రఘూత్తమునకున్ బాణ ప్రయోగాబ్ధికిన్.
శ్రీరాముఁడు తన కోదండముతో నిది చేయఁగలఁ డిది చేయలేడని లేదు. ప్రదరము అనగా బాణము లస్తకము వింటి మధ్యభాగము, ఎడమచేతి పిడికిలితో పట్టుకొనెడి చోటు. ధనుస్సును వంచి త్రాఁడు వదలి పెట్టగా నల్లెత్రాటి వేగము చేత బాణము పోవును. ఈ రామునకు లస్తకముతో పని లేదు. చాపాంతము చాపాది అనగా ధనుస్సు చివర మొదలు ధనుస్సులో నేభాగమైనను సరే ఆయనకు లస్తకమే. ఆయన బాణప్రయోగాబ్ధి. బాణ ప్రయోగమునందు సముద్రము వంటివాఁడు ఆ బాణమెట్లు వేయునో తెలియదు. ఇతరులకు వలె సామాన్య లక్ష్యము కాదు. ఒకసారి లంకలో ఒక బాణముఁ బ్రయోగింపగా నా బాణము గోపురము మొదట భూమిలో దూరిగోపురమును పెల్లగించెను. ఇది సాధ్యమా? తపోలోకములను నాశనము చేసినట్లే.
మ. పదియున్‌తొమ్మిది శైవచాపమునకున్ బ్రద్దల్ మఱిన్‌వంచగా
నది సాధ్యంబని లేద యెవ్వరికినిన్ నద్ధంబుగా విర్చెదో
ర్విదితంబై చను శక్తియెట్టిదియొ యావేశంబునన్ వచ్చెఁగా
ని దురావేశముచేత నీతఁడు హిమనీశైలజా భర్తయా ?
ధనుశ్శాస్త్రములో ధనుర్నిర్మాణమును గూర్చియున్నది. ధనుస్సువెదురు కఱ్ఱతో చేయుదురు. దాని నడిమిభాగమునందు చెక్కి బ్రద్దలంటింతురు బ్రద్దల సంఖ్య యెక్కువైనకొలఁది ధనుస్సు వంచుట కష్టము. శైవధనుస్సునకు పందొమ్మిది బ్రద్దలు. సృష్టిలో మరి యే ధనుస్సునకు నిన్నిబ్రద్దలుండవఁట. ఇది ధనుశ్శాస్త్రము. ఆ ధనుస్సును శివుఁడొక్కఁడే వంచగలఁడు. రామునిదోశ్శక్తి యెట్టిది? ఆయన మహాబలమెంతది. అంత బలమెట్లు వచ్చినది. ఆవేశమున వచ్చినది. ఆయనను విష్ణు వావేశించినాడు. అందుచేత శైవధనుస్సును విఱుపగలిగినాఁడు. అయినను శివధనుస్సు వంచరానిదిగద. ఈయన అవతారావేశము చేత విష్ణువు. సీతను పెండ్లియాడుటకై శివధనుస్సును వంచవలయును. అప్పుడొక దురావేశమును తెచ్చికొన్నాఁడు. దుఃఖముచేత బరువుచేత కష్టముచేత తెచ్చికొన్న యావేశము. తాను విష్ణువై యీ ధనుస్సు కొఱకు శివావేశము తెచ్చుకొన్నాఁడని యర్థము. దాని నెట్లు తెచ్చుకొనెను? ఇతఁడు శివుఁడేనా? హిమానీశైలము-మంచుకొండ, హిమానీశైలజ-పార్వతీదేవి. ఆమెభర్త శివుఁడు. ఈయన యే విష్ణువు. ఈయనయే శివుడా? రామరావణ యుద్ధము లంకలో చిట్టచివరకు రావణాసురుని బహులక్షల మూలసైన్యమును రెండు రెండున్నర గడియలలో శ్రీరామచంద్రుడు నాశనముచేసి ప్రక్కనున్న సుగ్రీవాదులతో నిట్లనెను. 'ఇంతటి స్వల్పకాలములో నింతటి మహావధ నేను చేయఁగలను. శివుఁడు చేయగలఁడని. కనుక శివకేశవులకు భేదములేదు.
జనకమహారాజు గృహములో నున్న యీ శివధనుస్సును గూర్చి వాల్మీకములో నొక కథయున్నది. శివుఁడెక్కువా, విష్ణువెక్కువా? అని యొకప్పుడు దేవతలకు సందేహము కలిగెనఁట. అందుచేత దేవతలు వారిద్దఱి నడుమ విరోధమును కల్పించిరి. ఇద్దఱును యుద్ధమాడిరి. శివునిచేతిలోని ధనుస్పు స్తంభించిపోయెను. శివుఁడు 'ఛీ' ఈ ధనుస్సని దానిని పారవేసెను. ఆ ధనుస్సే క్రమక్రమముగా జనకరాజు నింటికి వచ్చెను. దేవతలు విష్ణువెక్కువ యని నిర్ణయించుకొనిరి. శివుఁడు దోషమును ధనుస్సునం దిఱికించెను. అనగా శివధనుస్సుకంటె విష్ణుధనుస్సు గొప్పదా? ధనుసుశ్శాస్త్రము ప్రకారము శివధనుస్సు గొప్పది. ఆ కథా తాత్పర్యమేమనగా శివుఁడు ప్రళయ కారకుఁడు. విష్ణువు స్థితికారకుఁడు. ఈ సృష్టికి అనగా సృష్టింనడచుటకు స్థితి యవసరము. సృష్టియొక్క దృష్టిచేత విష్ణు వధికుఁడు. శివధనుస్సు విష్ణుధనుస్సుకన్న గొప్పది. కాని, సృష్టి జరుగవలయును. రాముఁడు సీతను పెండ్లాడవలయును. రావణాసురుని చంపవలయును. అందుచేత రాముని చేతిలో శివధనుస్సు విరిగినది. ఒక్కొక్క మన్వంతరములో గొన్నికొన్ని మహాయుగములుండును. ఇది వైవస్వత మన్వంతరము. ఇప్పుడు జరుగుచున్నది వైవస్వత మన్వంతరములో నిరువది యెనిమిదవ మహాయుగము. మన సంకల్పములలో వైవస్వతమన్వంతరే, ప్రథమపాదే,జంబూద్వీపే అని చెప్పుచున్నాము. ఈ లెక్కయెట్టిది? ఇప్పుడు క్రీస్తుశకములో కొన్ని వేల సంవత్సరములైనదని చెప్పుకొనుచున్నాము. శాలివాహన విక్రమార్కశకములు కూడ నిట్లే చెప్పుచున్నాము. ఆశకము లారంభించిననాఁటినుండి లెక్క వేసికొనుచు వచ్చుచున్నారని యర్థము కదా! వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే యన్నలెక్కమాత్రము ఆనాదినుండి లెక్కవేసికొనుచు వచ్చుచున్నదికదా? మధ్యనెవరో కల్పించిరా? అయినచో క్రీస్తుశకమును మధ్యనెవరో కల్పించిరి. సామాన్యజ్ఞానము కూడ లేని దురాలోచనాపరులు యథేచ్ఛముగా వాదింతురు. పద్మకల్పములో కొన్ని మన్వంతరములు కలిసినచో నొక కల్పమగును. అప్పుడు రామకథ జరిగినది. మన రామాయణములో వానరులు సముద్రముమీఁద వంతెనకట్టినారు. పద్మకల్పములో జరిగిన రామాయణములో రాముఁడు శివుని ప్రార్థించగా శివుఁడు తన ధనుస్సును సముద్రముమీఁద వైచినాఁడు. వానర సైన్యము దానిమీఁద నడచి పోయినది. అది శివధనుస్సు. కల్పకల్పమునకు నీ పురాణములలోని మహాకథలు జరుగుచునేయుండును. చరిత్ర మఱల జరుగుచునే యుండును. (History repeats itself) అను పాశ్చాత్యులది స్థూలదృష్టి మనది సూక్ష్మదృష్టి. కల్ప కల్పములిట్లే. అవే పురాణములనగా.
శా. విల్లడ్డమ్ముగపంచుఁ గోలగనుపంపించున్ శరంబేయఁగా
విల్లేవంపున నున్ననున్ సరియెపో విల్ముఖ్యమా! తానయా
విల్లున్ బట్టి నిమిత్తమాత్రమగునో విల్కాఁడు తా నౌటకున్
విల్లంచున్నది గడ్డిపోచ శరమా విల్లాడుకో వస్తువై.
రాముఁడు వింటిని తానెట్లుపడిన నట్లేవంచును. అది యెట్లున్నను సరే బాణము పోవుచునే యున్నది. ఆ విల్లు ముఖ్యమా తాను ముఖ్యమా? తానే ముఖ్యము. ఆ ధనుస్సువట్టి నిమిత్తమాత్రము. మఱివిల్లెందుకు? రాముఁడు విల్కాఁడని చెప్పుకొనుటకు కాకాసురుని మీఁదగడ్డిపోచ నభిమంత్రించి వేసెను. మరి విల్లెందుకు? దీనిని బట్టియే విల్లాడుకొనువస్తువని తేలిపోవుచున్నది. కోదండము యొక్క వ్యుత్పత్త్యర్థము సరిపోయినది. రావణాదుల నిట్లే. చంపవచ్చును. మహాస్త్రములకు విల్లక్కఱలేదు కాఁబోలు. మరి విల్లెందుకు? తానుకోదండరాముఁడగుటకు. ఆ విల్లు బుజాన నుండవలయును. దానితో సహా స్వామిని ధ్యానించవలయును. ఉపాసన చేయవలయును. కోదండరామమంత్రములో కోదండమునకు గూడ ప్రాధాన్యమున్నది.
శా. శై వుండై మరితాను వైష్ణవము వంచన్‌జేతి కందిచ్చెనా
శై వంబన్నది వైష్ణవంబునకు లొచ్చా శ్రీరఘూత్తంసుదో
రావిర్భావ పరీక్షచేయుటకునా యాతండు నారాయణుం
డా విష్ణుండైన సరే మరేమిటికిఁ గోపావేశ మీపాటికిన్.
పరశురాముఁడు శైవుఁడు. ఆయన విష్ణుమూర్తియొక్క యావేశావ తారము. విష్ణువు వచ్చి శైవుఁడైన వాని నావేశించెనా? వైష్ణవము కంటె శైవము తక్కువైనదైనచో నీయావేశము విష్ణువునకు మర్యాదాభంగము. రామునియొక్క బాహుబలమును పరీక్షచేయుటకీ పనిచేసెనా? ఇతఃపూర్వము చెప్పిన కథలో శివకేశవులకు యుద్ధము జరిగెను. శివధనుస్సు స్తంభించిపోయెను. ఆ ధనుస్సేజనకమహారాజు నింటిలోనున్నది. ఇప్పుడు పరశురాముఁడు రాముని చేతికందించిన విష్ణుధనుస్సు ఆనాఁడు విష్ణువుయొక్క చేతిలో స్తంభించని ధనుస్సు. అది క్రమముగా పరశురామునిచేతిలోనికి వచ్చినది. రాముఁడు విష్ణువైనచో దీనిని వంచవలయును. వంచినచో విష్ణువే. రూఢియగును. కొంచెము సందేహమున్నది. ఆ సందేహము కూడ తీరిపోవును. అంతేకాదు విష్ణుధనుస్సు విష్ణువు యొక్క యవతారము చేతిలోనికిపోవును. పోవలయును. పరశురామునికి తెలియును. తెలిసి యీకోపావేశ##మెందుకు? లోకము కొఱకు. రాముని యాధిక్యమును నిరూపణ చేయుటకు, తానావేశావతారము మాత్రమే. అస లవతారము రాముఁడు రెండవతారము లొక్కసారి యెందులకు? ఆ పరశురాముడే రావణుని చంపరాదా? రావణుఁడు శైవుఁడు. అదిన్యాయముకాదు. కథయొక్క లోతుపాతులు విచారించినచో లోకము లోకముయొక్క నడక చమత్కారములు. మహావస్తువు మహావస్తువే. బంగారము బంగారమే. అది ఒకప్పుడు ఉంగరము. ఒకప్పుడు గాజులు, మరియొక్కప్పుడు మెడలో గొలుసు. కొంపగడవక అమ్ముకొని తినవలసి వచ్చినచో బంగారపు వెలయే. దాని ప్రమాణమును బట్టి డబ్బువచ్చును. పరమేశ్వరుఁడు పరమేశ్వరుఁడే! ఆయన తత్త్వ మాయన తత్త్వమే. ఈ లోకములో నీ సృష్టిలో ఉపాధినిబట్టి మార్పులు.
ఉ. బాలుఁడు రాఘవుం డగుచు భార్గవుఁడేగిన దిక్కునన్ దయా
శీలుఁడునై నమస్కృతిని జేసెను వారలొకళ్లొకళ్లులో
లో లలితాత్మలందెఱుఁగు లోపల నేమి యెఱుంగనైరొజం
ఘాలుఁడు భార్గవుఁ డగుచుఁ గాల్నిలువంగను ద్రొక్కరాముఁడై
రాముఁడు వయస్సుచేత చిన్న వాఁడు. పరశురాముఁడు వయస్సుచేత చాల పెద్దవాఁడు. ఆయనకు నమస్కారము చేయవలయును. అనాఁ డమలులో నున్నది గౌతమస్మృతి. గౌతమస్మృతిలో వృద్ధుఁడైన శూద్రుఁడు వచ్చినను వయస్సులో నున్న బ్రాహ్మణుఁడు పండితుఁడైనను లేచి నిలుచుండవలయునని యున్నది. పరశురాముఁడు యుద్ధమునకు వచ్చినాఁడు కనుక తొలుత నమస్కారము చేయలేదు. ఇప్పుడు తనకు తక్కువై వెళ్ళిపోవుచున్నాఁడు. ఇప్పుడు రాముడాదిక్కునకు తిరిగి నమస్కరించినాఁడు. ఏమి యందమైన మర్యాదలు. ఇది భారతదేశనాగరికత. రామునిగూర్చి రాముఁడెఱుగును. జంఘాలుఁడనగా పిక్కబలము కలవాఁడు. పరశురాముఁడు పాఱిపోయినాఁడని యర్థము. కాని తనయంధున్న విష్ణువుయొక్క యంశను రామునియందు నిక్షేపించి వెళ్ళినాఁడు. రాముఁడు కాలు నిలువద్రొక్కుకొన్నాడు అవతారము కొఱకు రాముఁడు కాలు నిలువద్రొక్కుకొనవలయును. రావణసంహారాదుల కొఱకు. కాని చమత్కారము చూడుఁడు పరశురాముఁడు చిరకాలజీవి రాముఁడుకాఁడు. కాలునిలువ ద్రొక్కుకొన్నది రాముఁడు. వెళ్ళినది పరశురాముడు. పరశురాముఁడే రావణుని సంహరించుటకు కారణ సామగ్రి లేదు. రావణసంహారములో నూటికి తొంబదిపాళ్ళు సీతపని. సీత పరశురామునికి భార్య కాకూడదు. వట్టి రావణసంహారమైనచో చేయవచ్చును. ఇవి యన్నియు మెలికలు. లోకము ననుసరించి జరుగవలయును. ఎంత యవతార మెత్తినను లోకముప్రధానము. శ్రీరాముఁడును కృష్ణుఁడు నవతారములైనను లోకము ననుసరింతురు. సుఖదుఃఖములు లోకములోని వారివలెనే యనుభవింతురు. లేనిచోఁ గావ్యములేదు. కావ్యమునందు లోకచిత్రణము ప్రధానము. భోజనములో నన్నమువఁటిది. కూరల పచ్చళ్ల పులుసుల రుచికొద్ది నన్నము లోనికి పోవును. రాముఁడు కథానాయకుఁడగుట, ఆయన పరమేశ్వరుఁడగుట, ప్రధాన వ్యంజనము. వ్యంజనమనగా కూర పచ్చళ్ళు మొదలైనది అప్పుడు గాని తృప్తిలేదు. అప్పుడుగాని రసము పుట్టదు. కవి వంట చేసినవాఁడు వానిపోపులు వాఁడు పెట్టును. వాని తిరుగమూఁతలు వాఁడు వేయును. దానిపేరే శిల్పము. రసోదయము కలుగును. దయాశీలుఁడై నమస్కృతిని చేసెను. రామునకు పరశురామునియందు దయకలిగెను అగా రాముఁ డధికుఁడు, పరశురాముఁ డల్పుడునైనాఁడు. ప్రస్తుత పరిస్థితులలో వారి సమానత్వము పోయినది. తాను సంపూర్ణముగా విష్ణుమూర్తి యైనాఁడు. మరియు రాముఁడు ఉపాధి బలముచేత పరశురామునియందు దయ చూపించుటకు యోగ్యుఁడయినాఁడు.
ఉ. కంబమువోలె నిల్చిన యఖండ విమానముఁ బెల్లగించి ధా
త్రింబడవేయఁ దీర్చినది తీరుపు నమ్మును బట్టు టెట్లు రా
త్రింబవలైన యభ్యసన రీతియు నట్టిది చాపమూను నే
ర్పుం బచరించు టెప్పగిది పోల్చగరా దది చాపవిద్యలో
ఇందులో వెనుకఁజెప్పిన రావణాంతఃపుర సమీపముననున్న విమానమును బాణముతో పెల్లగించి పడగొట్టుట అట్లు చేయుటకు నది యేమి తీర్చిన తీర్పు? బాణమును పట్టుటెట్లు? రాత్రింబవ లభ్యాసముఁజేసిన పద్ధతి యెట్టిది? రాముఁడు ధనుస్సు నెట్లు పట్టుకొన్నాడు? విమానమును పైని పగులగొట్టవచ్చును. రాముఁడు బయట నున్నాడు. విమానము కోటలోనున్నది. కోటకు ప్రాకారమున్నది. ఈ బాణము ప్రాకారము మీఁదినుండి పోయి విమానము ప్రక్కభూమిలో దిగబడి గడ్డపలుగుతో మట్టిబెడ్డ పెల్లగించినట్లు విమానమును లేవనెత్తవలయును. ఇది యెట్లు సాధ్యము? బాణమునకు 'నజిహ్మగము'అని పేరు. జిహ్మ-వక్రమైనది. అజిహ్మము-సూటియైనది. అజిహ్మగము-సూటిగా వెళ్ళునది. రాముని బాణ మజిహ్మగము కాదేమో! పైకివెళ్ళ నేలకు వ్రాలి నేలలో దిగి విమానమును పెల్లగించునా?
ఉ. లావరి చెట్టువెన్కను గలాడు శరంబును దూయనెంచి, సు
గ్రీవునితోడ యుద్ధమొనరింపవలెన్ దనగుండె యమ్ము సూ
టైవెలయంగరాని దగునట్టిది చంక్రమణంబులోన న
మ్మేవిధి గుండెగ్రుచ్చుకొనె నేర్పఱు పంగను రాద వాలికిన్
వాలి సుగ్రీవునితో యుద్ధముఁ జేయుచున్నాఁడు. రాముఁడొకదిక్కు చెట్టుచాటునుండి బాణము వేయును. అది వాలికిఁ దెలియును. యుద్ధములో వాలి చంక్రమణము చేయును. గడుసుగా తిరుగుచుండును. ఏ నిముసములోనైనను, రాముఁడున్నచోటునుండి బాణమువదలినచో నా బాణము తన గుండెలో గ్రుచ్చుకొనదు. వాలి చేసెడి చంక్రమణ మట్టిది. రాముఁడేవైపున నున్నాఁడో తెలియునుగదా. ఆ వైపునకు గుండె త్రిప్పడు. కాని, రాముని బాణము సూటిగా వాలిగుండెలోఁ గ్రుచ్చుకొనెను. అది గుండెలో నెట్లు గ్రుచ్చుకొనెనో వాలికి తెలియలేదు. రామునిబాణ మజిహ్మగముకాదు. జిహ్మగము. జిహ్మగమనగా సర్పము. ఆబాణమొక త్రాచుపాము వంటిది. మెలికలు తిరుగును. చివరకు వాలికి రాముఁడు పరమేశ్వరుఁడని తెలిసెను. అందుచేత స్వామి బాణ మెట్లైనను తిరుగును. ఏ విధముగా నైన వదలును. ఎక్కడ తగులవలయునో అక్కడే తగులును. స్వామి స్వామియని తెలిసిన తరువాత వాలి కాసందేహము తీరెను. ఆ రాముని బాణము సూటిగా వెళ్ళునని నమ్మకములేదు. అటుపోవును, ఇటుపోవును, మలుపులు తిరుగును.
చం. చెలువుగ సూటిగాగను నజిహ్మగమంచును పేరుదానికే
యెలసినఁ దాడి చెట్లవియునేడును సోలుపుగాగ నున్నవా?
చెలువుగ చెట్టుపైనిఁ బడి చెట్టుగ నన్నియు నేలఁబడ్డవా?
తొలచిన బాణమేడిటిని దూసినదా? అదియేమొ చోద్యమా ?
ఏడు తాడిచెట్లు వరుసగా నున్నచో బాణమేడింటిలోనను దూసికొనును. తాడిచెట్లు గుంపుగా నున్నను నొకదానిపై నొకటి యేడును పడిపోవచ్చును. కొంచెము దూరముగా నున్నచో కష్టము. బాణము మలుపు తిరుగవలయును. ఆ తాటిచెట్లు వరుసగా నున్నవో, గుంపుగా నున్నవో, దూరదూరముగా నున్నవో, యీ బాణమెట్లు వెళ్ళినదో, ఏడు తాడిచెట్లును పెల్లగింపఁబడుటెట్టిదో ఊహకందని విషయము. మనకు తెలియదు. ఆ తాడిచెట్లున్నస్థితి సుగ్రీవునకుఁ దెలియును. అంజనేయునికి తెలియును వాలికిఁదెలియును.వానరులకుఁ దెలియును. వారంద ఱాశ్చర్యపోయినారు. అనగా నాతాడి చెట్లనన్నిటిని ఒక్కబాణముతో కొట్టుట సంభవమన్నమాట. అందుచేతనే సప్తతాళదళనమును రాముని ధనుర్విద్యాశక్తి కుదాహరణముగా చెప్పుదురు.
చం. ఆగములు గుంపుగా కలవ యందికపొందికలేక యా యజి
హ్మగమును జిహ్మగం బగున మానని యచ్చెరువంద వానరుల్
ప్రగతిఁ జరించి బాణములు బాణపులక్షణముల్ త్యజించి యే
మిగఁజనెనో రఘూత్తముని మీఁదుగ బోయిన వెల్ల త్రోవలున్.
అగములు-చెట్లు, మఱల తాడిచెట్ల విషయమే చెప్పఁబడుచున్నది. ఆయన బాణములకు బాణముల లక్షణములేదు. ఆయనవదలెడి యెల్లబాణముల యొక్క త్రోవలు రాముని మీఁదుగా నున్నవి. ఆ వ్యవహారము బాణములమీద లేదు. స్వామిమీఁద నున్నది. ఆయన బాణములు పోయెడు తీరులోని విలక్షణత్వము చెప్పినఁగాని యాయన కోదండరాముఁ డన్న మాటలోని యర్థము తెలియదు. ఆ కోదండమాటవస్తువు. కోదండరాముఁ డుపాసనామూర్తి. అంతే, విల్లులేదు. బాణము వేయుటలేదు. లోకములోని ధనుస్సులకులోకములోని బాణములకు శ్రీరామచంద్రుని ధనుర్బాణములకు సంబంధములేదు. కోదండరాముఁడనగా నిది.All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?oldid=31050.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|