Revision 97382 of "ఓ పువ్వు పూసింది" on tewikisource{{తొలగించు|కాపీహక్కుల సమస్యవున్నందున (చర్చాపేజీలో సేకరించినవారి స్పందన ) ప్రకారం}}
'''[[ఓ పువ్వు పూసింది]]''' [[చలం|గుడిపాటి వెంకటాచలం]] రచించిన ఒక మంచి కథ. దాని పూర్తి పాఠం ఇక్కడ చేరుస్తున్నాను:
----
అర్ధరాత్రి అడవిలో పువ్వు పూసింది. చుట్టూ చీకటిని చూసి, భయమేసి, 'అమ్మా' అని ఏడ్చింది. ఆకులూ, తొడిమలూ దగ్గరగా తీసుకుని భయం లేదని పూయించాయి ఆ తెల్లని పువ్వుని.
"ఏదీ ?" అంది పువ్వు.
"ఎవరు ?" అంది తల్లి తీగ చీకట్లోంచి.
"నన్ను నీ దగ్గరికి తీసుకువచ్చాడూ, అతను."
"ఎవరు తీసుకువచ్చారు ? నేనే తెచ్చుకున్నాను నిన్ను; నా గారాబాన్ని , నా బంగారాన్ని, నా ముద్దుల మురిపాన్ని, నిన్ను"
"నువ్వేనా ? ఎవరో అనుకున్నాను. నువ్వేనా నా చేతిని పట్టుకుని నక్షత్రాల మధ్యనించి ఆడుతో, నవ్వుతో, అట్లా తేలివచ్చి నన్నిక్కడ దించింది ? ఓసారి కనపడు"
"తెల్లారనీ, నన్ను చూద్దుగాని, ఇప్పుడు పడుకో"
"భయమేస్తోంది, కిందికి పడిపోతానా ?"
"నేను పట్టుకున్నాను కదూ !"
"ఆకలేస్తోంది అమ్మా !"
పువ్వు నోట్లోకి వెచ్చగా, తియ్యగా, ఒంటినంతా సంతోషంతో నింపుతో పాలు వచ్చాయి.
"వచ్చావా ?" అని ఒళ్ళో పెట్టుకుని ఊపింది గాలి.
"అమ్మా ! ఏమిటి అట్లా పాకుతోంది నా వెనుక ?"
"ఏం లేదు; అది పాము. తిండికోసం తిరుగుతోంది"
"నన్ను తింటుందా ?"
నిన్నెందుకు తింటుంది ? చాలా మంచిది. పిట్ట పిల్లల్ని తింటుంది. మన జోలికి రాదు" పెద్ద పెద చెట్ల వెనకనించి అర్ధచంద్రోదయమౌతోంది. కళ్ళు పెద్దవిగా విప్పింది పువ్వు. చెట్లకొనలు మెరుస్తున్నాయి. నేలమీద సందుల్లోంచి చారలుగా వెన్నెల పాకుతోంది. చీకటిని పక్కలకి తోసుకుంటో, చుట్టూ అడివిని చూసి -
"చూడు, అమ్మా చూడు" అంటో చప్పట్లు కొట్టి ఆడింది పువ్వు. నిద్రకళ్ళతో పాడుతోంది తల్లి.
తలెత్తి తల్లివంక చూసింది.
"ఎంత అందంగా ఉన్నావు అమ్మా !"
తన కళ్ళకి అందక తల్లిని తీగెలు చీకట్లలోకి పెనవేసుకున్నాయి. పరిమళాలలో విరబోసుకుని నల్లని నీడల్లో ఊగుతున్నాయి ఆకు గుబుర్లు.
"ఎవరిమీదనమ్మా కావిలించుకుని అల్లుకున్నావు ? అతనెవరు గంభీరంగా అట్లా నుంచున్నాడు నీ బరువు మోస్తో ?"
"మీ నాన్న"
"అమ్మా, అమ్మా, అమ్మా ! ఎవరు అట్లా కిరకిర మంటారు ? అమ్మా పట్టుకో నన్ను"
"అవి కోతులు, మీ నాన్నకోసం వస్తాయి. నిన్నేం చెయ్యవు అవి"
"మరి నాన్న వాటిని..." తనపేరు పిలుస్తున్నారు. పాడుతో వెన్నెలలో తేలి తనచుట్టూ మూగుతున్నారు పుష్ప కిన్నెరలు. తనెరుగును వాళ్ళని. "పుట్టావా ? నువ్వు ఇక్కడ పుట్టావా ? - చుట్టూ మూగి, పువ్వుని కడుగుతున్నారు. రేకుల్లో చిన్నచిన్న నొక్కులు అందంగా దిద్దారు.
మంచు ముత్యాలహారాలు వేశారు. వాళ్ళ వెనక తనకి కనపడకుండా నీడలో ఎవరు నుంచున్నారు ? తనకి తెలుగు ఎవరో ! ఎప్పటెప్పటినించీ, అనంతకాలం నించి, అనేక రూపాలలో, అనేక లోకాలలో, అనేక ఆనందాలలో తనతో చెయ్యి కలిపి ఎన్నడూ తనను వదలని ఆ నీడ ఎవరు ?
తన తలపైనుంచి, చీకట్లలోనించి తియ్యని పిలుపు. దూరంగా దేనికోసమో అరుపు. ఆకులన్నీ నిలిచి వింటున్నాయి. గాలి చిన్న తరంగాలతో పులకించింది. ఎవరు ? ఎవరు ? ఎంత వెతికినా కనిపించని ఎవరు ?
"అమ్మా ! అమ్మా ! ఎవరు ?"
"కోవెల"
"ఎవర్ని పిలుస్తుంది ?"
"ప్రియుణ్ణి"
"రాడేం ?"
"చీకటి"
"మళ్ళీ పిలవమను"
"పిలుస్తుంది"
"ఎంత అందమమ్మా ఈ లోకం ? నేనెక్కడ ఉన్నాను ఇక్కడి రాక ?" పువ్వుకి ఎదురుగా పెద్ద కాంతి పుష్పం అంధకారపు తూర్పుశాఖన వికసించి జ్వలిస్తోంది. తేలికగా తనని కప్పి నవ్వించే మబ్బుతెరలోంచి తన వెలుగు చేతుల్ని జాస్తోంది పువ్వు వేపు.
----
ఉత్సవాలు, వాయిద్యాలు, అరుపులు, సంతోషాలు, ఊడుస్తున్నారు. తోరణాలు కడుతున్నారు.
జయ జయ ధ్వానాలు చేస్తున్నారు.
ప్రతి మబ్బుకి రంగుల్ని అలంకరిస్తున్నారు. ఆత్రుతగా సంతోషాన్ని ఆపుకోలేక ఇటూ అటూ పరుగెత్తుతున్నారు. అనిలకుమారులు, దుమ్ము దులుపుతూ, అందర్నీ మేలుకోమంటూ, ఎండిన ఆకుల్ని దూరంగా తోసేస్తో, చెట్లు గాలిలోకి నోళ్ళు తెరుగుకొని ఆరగిస్తున్నాయి. ప్రథమ భోజనాన్ని.
కాంతి, కాంతి, ప్రపంచమంతా కాంతి. ఆకాశాన్నంతా ఆనందంతో నింపుతోంది కాంతి. అలలమల్లే కాంతి విరుచుకు పడుతోంది లోకం మీద.
లోకం రూపమే మారింది.
సగం చందమామ నవ్వుతో నమస్కరించి ఆకాశం లోపల కరిగిపోయినాడు. లోకాధిపతివలె వెలిగిన వేగుచుక్క భయంతో ఏ మూలకో వొదిగాడు.
మబ్బులు సిగ్గుతో రంగుల్ని కడిగేసుకుని, తెల్లని ఒళ్ళుతో పక్క పక్కల ముడుచుకున్నాయి.
దేదీప్యమానమైన కాంతితో ఎర్రగా, ఎక్కడా కల్మషాన్నీ, అంధకారాన్నీ అల్పత్వాన్నీ సంహించని, క్షమిమ్చని దివ్యనిర్మల తేజస్సులు కుక్కుకుంటో బయల్దేరాడు మార్తాండుడు. పక్షులన్నీ రెక్కలుచాచి ఎగురుతున్నాయి. మృగాలు ఒళ్ళు విరుచుకొని కదులుతున్నాయి.
పవన కుమారులు చెట్ల ఆకుల చివర్లలో కూచుని భయంగా చూస్తున్నారు. సమస్తమూ మరచి కళ్ళు తెరుచుకుని చూస్తున్న పువ్వువైపుకి తీక్షణంగా ఒక్క కిరణాన్ని విసిరాడు సూర్యుడు.
"చచ్చాను" అని కళ్ళు మూసుకుంది కన్య. వొళ్ళంతా వణికిమ్ది. దెబ్బతిన్నట్టు సొమ్మసిల్లిమ్ది. తానంతా ఎర్రగా అయిపోయింది. ఒక్కసారి తన మొదట్లోంచి, నేలలోంచి చీల్చుకుని తనలోకి దిమ్మరించే అమృతంతో తానంగా నిండిపోయింది. "అమ్మా" అని ఒక్క అరుపు అరిచింది. భయం కాదు. సంతోషం కాదు. చావు కాదు. పుటక కాదు. నవయవ్వనం.
తనలోకి ఆ లేత ఎండ, వెన్నెల, కింది గడ్డి నవనవ, ఆకాశంలోని నీలపు నునుపు, తన తండ్రి కొమ్మల బలం, కోవెల కంఠంలోని జాలి, గాలిలోని అర్థంలేని అల్లరి. తన తల్లివేళ్ళ కింది భూమిలోని అనర్గళసారం- అన్నీ ప్రవహించాయి.
తన రేకుల్లో తళతళలు, తన ఈనెల్లో నున్నటి పుబుకు, తన బొడిపెల్లో పగలడానికి సిద్ధమైన మదపు సౌరభం, తన తొడిమలో విశాలమౌతున్న బలం, తన సమస్తంలో ఆగని, అంతులేని, కారణంలేని కాంతి.
అకస్మాత్తుగా తనని ముంచుతో, చీలుస్తో పైన దొర్లి సముద్రం అలలమల్లే, మూర్ఛలు తెప్పించే పరిమళం. తనని, తల్లిని, గాలిని, ఆకాశాన్ని నింపి, పొర్లే అలలుగా, జ్వాలలుగా తనలోనించి పరిమళాలు.
పట్టలేక ఫక్కుమని నవ్వింది. ఆ నవ్వు ఎండకే కాంతి నిచ్చింది. ఆ మత్తుకి, ఆ మాధుర్యానికి ఆకాశం కిందికి దిగిరావద్దా ? గాలి ఈ వార్త ముల్లోకాలలో ప్రకటించవద్దా ? ఆ కాంతి అంతా ఒకటై తనకి హారతి ఇవ్వద్దా ? ఈ చెట్లు, పక్షులు, కీటకాలు, మృగాలు, ఈ అనంతాకాశం, సూర్యచంద్రులు, ఈ లోకమే తన పరిమళ సౌభాగ్యం కోసం సృష్టి పొందలేదా ?
తనముందు ఇంకెవరు ? అల్లరిగా గంతులేసింది. చప్పట్లు కొట్టింది. కళ్ళలోంచే కాంతుల్ని విసిరింది. ఎవరు అటువెళ్ళినా ఆకుల వెనక దాక్కుని తొంగి చూసి పకపక నవ్వింది. తన రేకుల్ని ఊపింది. పరిమళాన్ని ఎక్కడా అంతంలేని భాగ్యంమల్లే విరజిమ్మింది ప్రపంచం మీద. సంగీతాలతో, నృత్యాలలో సోలుతో, తూగుతో, చుట్టూ మధుపాలు సేవించి వెంబడి రాగా, పూలని లెఖ్కకింద తలెత్తి చూడకుండా, గర్వంగా, యవ్వనంతో మదించి, ఒంటినిండా పచ్చని పుష్పరజం చల్లుకుని పోతున్నాడు మధుపం.
ఎండల్లో రజంలోంచి నల్లగా మెరిసే అతని దేహం. క్రూరమైన తొండం, రక్తంవలె ఎర్రనైన కళ్ళు గాలిని శూలాలవలె గుచ్చే పెద్దమిసాలు చూసి వణికింది పువ్వు. "అమ్మా ! ఎవరిది ?" అని తల్లి ఆకుపచ్చ పమిటలో దూరింది. నవ్వి కూతురు తల నిమిరింది.
"నీ జోలికి రాడులే" అంది కొంటెగా తల్లి.
"రాడా ? ఎంత పొగరు ?" అంటో ఆకుల్లోంచి సగం తొంగిచూసి, పరిమళాల్ని విసిరిమ్ది పువ్వు. ఊపిరాడనీక మొహానికి అడ్డుపడి, తెక్కల బలాన్ని లాగేసే ఆ పరిమళానికి తల తిరిగి ఆగాడు మధుపం.
"అమ్మా ! ఆగాడు" అంది భయంగా పువ్వు.
తనని ఆగనీక, నిలవనీక, ఏమిటి ఆ బాధ ? తియ్యని మత్తెంకించే ఆ వేదన ? ఏమిటో తనకి తెలీక, భయపెట్టి తనని తొందరచేసే ఆకాంక్ష !
తిరిగాడు తనవేపు. పొమ్మన్నాడు అనుచరుల్ని. మళ్ళీ ఇంకోసారి కొత్తపూరజం అతనినిండా చల్లి అలంకరించి ఎగిరిపోతున్నారు మిత్రులు. చుట్టూ ఆకుల మీద వాలి నవ్వుతున్నారు పోకిరివాళ్ళు.
తనవేపు ఎగురుతున్నాడు అతను. బలంగా ధైర్యంగా అతనికి ఎదురు ఎదురు అన్నట్టు. ఎండలో మెరుస్తో, తేలుతో, గాలిని పీల్చుకుంటో వస్తున్నాడు అనివార్యంగా. సిగ్గు సిగ్గు. తన గర్వం, తన ఆధిక్యత, విజృంభణ- ఏమీ లేవు. దాక్కుంది ఇంకా లోపలగా, వస్తున్నాడని భయం, సంతోషం. తీరా రాడేమోనని దిగులు, న్యూనత.
వస్తున్నాడని గర్వం, సిగ్గు. ఏమిటి అంత స్వతంత్ర్యం ? ఏమిటి అంత ఆలస్యం ? తను తప్ప ఇంకేం కనపడకుండా అయి తనచుట్టూ ప్రాధేయపడి పాడాలి. తాను మాత్రం అందక, ఆకుల్లో తప్పించుకుని వేదించాలి, నిర్లక్ష్యంగా, అవలీలగా ఆకుల్ని ఒత్తిగించి, తనని నలుగురి ముందూ బాహాటం చేశారు.
క్రీగంటితో చూసి "ఫో, ధూర్తుడా !" అంది. కాని తన కంఠస్వరమేనా అది ? ఏమిటా తియ్యదనం, ఆ ఆహ్వానం ? తనెంత ప్రయత్నించినా తనకి లోబడని ఆ హృదయారాటం ? వెడల్పయిన స్వరంతో, జుమ్ముమనే ఆ ఆపులేని ప్రేమగీతాన్ని ఆలాపిస్తో తన చుట్టూ తిరుగుతున్నాడు. ముందు కాళ్ళని తనవేపు జాచి, తెక్కల మీద రంగు రంగులుగా మెరుస్తో ఎండ. అతని వొంటి మిద రజపు మదపు వాసన తల తిప్పుతోంది.
పొందివచ్చే వరదమల్లే ముంచేసింది. తనకింకేం తోచకుండా ఆ మధుపగీతం. సముద్రపు హోరుమల్లే, రక్తపు పోటుమల్లే, అడుగుతున్నాడు, నవ్వుతున్నాడు, తలవొంచి ముందుకాళ్ళతో ప్రాధేయపడుతున్నాడు. "నీ కోసమే అనంత కాలం నుంచీ వెతుకుతున్నాను. నా ఐశ్వర్యాన్ని నీ పాదాల ముందు గుమ్మరిస్తాను. తలెత్తి ఒకసారి నా వంక చూడు" అంటున్నాడు.
అన్నీ అబద్ధాలు. కాని, ఎంత ఎంత మధురమైన అబద్ధాలు ! నీవొక్కతతేనే నాకు అన్నాడు, ఆ పుష్పరజమంతా ఎక్కడిదో ? ధూర్తుడు. తెల్లని రేకలు మెరిపించి చిన్న నవ్వు నవ్వి దాక్కుంది ఆకుల మధ్య గాలి సహాయంతో.
అతను బలహీనంగా, మృదువుగా కొమ్మల్లోనూ దాక్కునే తన కోసం, ఇంకా రాడేం ? వెళ్ళిపోడు కదా ! మెరుస్తో, రెక్కల ఊపుతో, లెఖ్కలేని పువ్వుల మధ్య ముల్లోకాల్లో అవలీలగా సంచారం చేయగలిగిన అతను ప్రత్యేకంగా తన కోసం - తన ముందు ప్రాధేయపడుతున్నాడు. "పో !" అంది. పోతాడేమోనన్న భయంతో.
మధుపం ఆ మాటతో ఆమె తన స్వంతమైనట్టు అధికారమైనట్టు సంకోచం లేకుండా విహరించే రాజ్యసీమ ఐనట్టు, కరుకుగోళ్ళతో, మృదుపత్రాలు ఏమౌతున్నాయో అనే దృష్టి లేకుండా పువ్వు మీద.
"అమ్మా !" అని పెద్ద కేక వేసింది-ప్రాణం పోతున్నట్టుగా. అమ్మ పలకలేదు. తనని వదిలారా ! అందరూ వదిలారా ? ఇదే అంతమా ? తన ప్రాణాలు ఎగిరిపోతున్నాయి. నిర్దయగా ఏమీ తన అనుజ్ఞ లేకుండా, క్రూరంగా, గోళ్ళతో చీల్చి, తన దూర్చి, తను ఎపుడూ తనలో వున్నదని తెలీని, తన గర్భ కుహరాంతరాన్ని తొండంతో ఛేదించి తాగుతున్నాడు మధువునంతా.
వొళ్ళు చీలికలౌతోంది. రక్తాన్నే తాగుతున్నాడు. వెనకకాళ్ళ్తో పక్కల్ని సాగతీసి చింపుతున్నాడు ఇంక తనెట్లా బతకడం ? ఎట్లా మొహమెత్తడం ? కాని అప్రయత్నంగా రేకలతో అతన్ని కప్పి దాచుకుంది. తన ఈనెలతో సన్నని వొంపుతీరిన నడుముని కావిలించుకుని దగ్గిరికి లాక్కుంది. తనలోంచి పచ్చని పరిమళపు గంధాన్నంతా అతన్నిండా చల్లింది. తననే తానర్పించుకుంది.
"ఇంక నన్ను వదిలి వెళ్ళకు మరి" వేడుకుంది. "నేను నీ దా"న్నంది. "నీకన్న ఇంఏం లే"దంది.
ఇంకా, ఇంకా, ఇంకా... నాలో ఇంకేం మిగలకుండా నా ప్రాణాన్నే, ఆత్మనే తాగెయ్యమని రహస్యం పలికింది. ఘల్లుమంది ఒళ్ళు. తాను చూసిన సూర్యులు వెయ్యిమంది తన కళ్ళముందు భగ్గుమన్నారు. రాత్రి నక్షత్రాలన్నీ ధగధగ తనచుట్టూ నాట్యం చేశాయి. సముద్రాలు హోరుమన్నాయి. ఎట్లా భరించడం ఈ ఆనందం, ఈ బాధ, ఈ తీపి, ఈ తీపు !
గుండెబద్దలు కాదా ! నాళాలు చీలిపోవా ! తనరేకులే చించుకుని రాలిపోవా ? ఆగలేక పట్టుకుంది. దగ్గిరిగా కప్పేసింది. మూర్ఛపోయింది. వదిలేశాడు తనని కరుణామయుడు, మధురమూర్తి, తనని వదిలేసి తన కళ్ళలోకి నవ్వాడు. ఏమియ్యగలదు తాను ! చాలా హాయిగా సంతృష్టితో తన కళ్ళల్లోకి నవ్వాడు.
ఎవరు ? తానెట్లా తీర్చుకోగలదు ? ఈ కృతజ్ఞతని ? నమ్రతతో నమస్కరించింది. తనమీద కాళ్ళూని, అవలీలగా గాలిలోకి ఒక్క దూకుదూకి, చీకటి వెలుగు లాగు మెరిసి రెక్కల్ని జూచి, ఒక్క చూపు, తనవైపు వెనక్కి చూడకుండా వెళ్ళిపోయినాడు. అతని నెచ్చెలిగాళ్ళని ఒక్క కేకతో పిలిచి, వాళ్ళతో ఉల్లాసంగా నవ్వుతో తన ఉనికినే మరిచి, ఆతని వెంటబడి అడ్డుపడే తన హృదయాన్ని తోసేసి, తనకు తెలీని, తాను అందుకోలేని నీలపు లోకాల్లోకి, ఆకుపచ్చ కాంతుల మధ్యనించి ఎగిరి పోతున్నాడు. కనపడ్డంత దూరం దిగులుతో తలవొంచి చూస్తోంది. తానా కదలడం చేతకాదు.
ఆకుల తెరచాటున సిగ్గుగా పెరిగిన కన్య ఏమని తాను లోకం కళ్ళముందు సిగ్గు విడిచి, అతన్ని అనుగమించగలదు ? తనకే రెక్కలుంటేనా ? ఇంక ఎటూ చూడకుండా తల్లిని, తండ్రిని, ఆకుల్నిమ్ మిత్రుల్ని, సమస్తమూ మరచి అతని వెంట సహచారిణి అయి సేవ చెయ్యదా ? కాని అబల, దీవిస్తున్నారు, లాలిస్తున్నారు. తనచుట్టూ చిన్నచిన్న వనకన్యలు చేరి పాడుతున్నారు.
తన వొంటివంక గర్వంగా చూసుకుంది. ఎంతో సాఫల్యంతో, నిండుతనంతో, లోతులో, బరువెక్కిన తన వంక చూసుకుని పొంగిపోయింది.
సూర్యుడు పైకి లేచి పెద్దచెట్ల ఆకునీడల్ని మంటపెడుతున్నాడు. గుంపులు గుంపులుగా చిలకలు ఆకుపచ్చ మెరుపులవల్లే ఎగిరిపోతున్నాయి. సీతాకోక చిలకలు తప్పతాగి ఎండలో తూలుతున్నాయి. రంగు రెక్కల్ని గర్వంగా గాలిలో చాచి, సోమరిగా తేలిపోతున్నాడు గరుడుడు మబ్బుల మధ్య.
----
మెల్లిగా పొట్టివైపోయే నీడల్ని సోమరిగా చూస్తో, శాంతంగా కూచుమ్ది పువ్వు. బలంగా శక్తిని భూమి వేళ్ళలోంచి తనలోకి లాక్కుంటో, తన అందమంతా పోతేనేం ? పరిమళం లేకపోతేనేం ? కేసరాలు అవిసి, వొడిలి తన పత్రాల మీదనే వాలిపోతేనేం ? తనవైపుకి కాంక్షతో మధుపాలు చూడకపోతేనేం ? ఇప్పుడు తన చూపు తన లోపలికి.... తన జీవితానికి అర్థమే మారిపోయింది.
తన లోపల కొత్త ప్రాణం కదులుతోంది. చోటుకోసం వెతుక్కుంటో తన పక్కల్ని సాగతీస్తోంది. మధుపం తన నిండా విరజిమ్మిపోయిన పుష్పరజంతో పచ్చనై జారిపోయిన తన పత్రాల్ని ఎండ వెచ్చదనానికి వప్పజెప్పి, తన చుటూ జరిగే సృష్టి ఉత్సవంలో తానూ ఒక ముఖ్య పాత్రధారిణిననే గర్వంతో, ఇంకేం కావాలి అనే స్తిమితంతో, నిర్లక్ష్యంగా జూస్తోంది - క్షణమైనా ఆగక నిరంతరంగా అలలమీద నాట్యం చేసే సృష్టిలీలని. గాలి మీద చిందులు తొక్కుతోంది ఎండ.
ఆకాశాన మధ్య మండిపడే భాస్కరుడి కంటపడింది. ఆ పువ్వు తల్లి క్రూరంగా చూస్తో ఎదుట నిలిచింది. కాలం, పరిమళంలేని, మధువులేని, రంగుతప్పిన ఆ పువ్వుని అనవసరమని తల ఊపింది సృష్టి. రేకులరంగు తప్పి ముడతలు పడ్డాయి. కేసరాలు ఒక్కొక్కటి ఊడి జాలిగా కింద ఆకుల మీద వాలి గాలి ఊపుకి దుమ్ములో పడ్డాయి. కాని దృష్టిని తన గర్భంవేపు తిప్పి తననీ, తన అందాన్ని, ప్రపంచాన్నే మరిచింది పువ్వు.
----
మబ్బులనుంచి చివరి రంగుల్ని పిలుచుకుని సూర్యుడు ఎప్పుడు కడసారి సెలవు చెట్ల చిటారు కొమ్మలు మీది గరుడులనుంచి తీసుకొని వెళ్ళిపోయాడో ఎప్పుడు శాంతిగీతాల్ని వాయుకుమారులు పాడి కొమ్మల్లో కూచున్నారో, ఒక్క క్షణం విశ్రాంతిలేక తిరిగిన జీవులన్నీ ఎక్కడెక్కడ అన్ని వ్యావుర్తుల్నీ వదిలి నీడల్లో ఒదిగాయో, పక్షులూ, కోతులూ తన తలపై గుబుర్లలో ఎప్పుడు మాటుమణిగాయో గమనించనైనా లేదు పువ్వు. వెతికి వెతికి మూలమూలల దాక్కున్న వెలుతురిని మింగేస్తోంది వెయ్యి నాలుకలతో చీకటి.
మొదటి నక్షత్రపు మిణుకు మిణుకులోంచి జారిన కాంతిరేఖ మీద కూచుని వచ్చి నిలిచాడు తన ముందు.
తన పేరు పిలిచాడు. "ఎవరు ?" అంది పువ్వు. కానీ తెలుసు తనకి, గజగజ వణికించి చుట్టూ చూసింది ఏడుస్తో. "రా" అన్నాడు.
"నా పాపాయి" అంది. "నీ ప్రాణాన్ని నీ పాపాయికిచ్చి నాతో రా" అన్నాడు నవ్వుతో.
"ఎట్లా రానూ !" అని అరిచింది చివరి అరుపు.
తన చేతిని పట్టుకుని, కన్నీళ్ళు తుడిచాడు.
"చూడు" అన్నాడు.
లోకమంతా పెద్ద వెలుగు. అన్ని రూపాల్నీ, భిన్నత్వాల్ని తనలో కరిగించుకుంటున్న మెత్తని వెలుగు. నేలమీది ఎండుటాకులనించి, ఆకాశాన నక్షత్రాలదాకా, అన్నిటినీ ఏకంచేసే దివ్యకాంతి. అంతా, అంతా, ఆ వెలుగంతా అతను అన్నిచోట్లా అతను.
పొట్టలోని ఆ కళ్ళని నింపుతో, పట్టుకు చీల్చుకు తింటో, చీకట్లో దాక్కుంటో పిల్లలకి రసం తాగిస్తో చంపుతో, ఏడుస్తో, నవ్వుతో, కోపంతో, దూకుతో, ఆనందంతో, ఊగుతో- ప్రతి మూలా అతను తన పాపాయిని లాలిస్తో తాగిస్తో అతను.
"రా !" నవ్వుతో తన వార్ధక్యం, నిరర్ధకత్వం, ఎండుతనం అంతాపోయి, బాల్యం, యవ్వనం, బలం, సంతోషం, మాతృత్వం, ప్రేమ, అన్నీ అతనిముందు అర్పించి మొక్కింది. అతని చెయ్యి పట్టుకుని అనంతాకాశంలోకి ఒక్క దూకు దూకింది. ఇంక భయమనేది లేదు. విచారం లేదు, సందేహం లేదు. సమస్తమైన ప్రపంచంతో, కాలంతో అతి సన్నిహితుడతడు. అతని వేళ్ళను పట్టుకున్న తననిక ఏమూల ఏరూపంలో నిలిపినా ఆ కొత్త ఉండదు.
తన కోసం చేతులు జాచి ఉంటాయి.
చిరునవ్వులు వెలిసి ఉంటాయి. తన ఆగమనం కోసం గొప్ప విలువలు ఉంటాయి. ఆకాశంలో తేలుతూ, భక్తితో అతని మొహం వంక చూసి పక్కున నవ్వింది ఆనందాన్ని అణచుకోలేక.
***కథ ముగిసింది***
[[వర్గం:చలం రచనలు]]All content in the above text box is licensed under the Creative Commons Attribution-ShareAlike license Version 4 and was originally sourced from https://te.wikisource.org/w/index.php?oldid=97382.
![]() ![]() This site is not affiliated with or endorsed in any way by the Wikimedia Foundation or any of its affiliates. In fact, we fucking despise them.
|